ప్రేమ పేరుతో కామాంధుడి ఘాతుకం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో కామాంధుడి ఘాతుకం

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

మైనర్‌ బాలికపై అత్యాచారం

అధిక రక్తస్రావంతో

అపస్మారక స్థితిలోకి..

పోలీసులకు ఫిర్యాదు

ఖాజీపేట : ప్రేమ పేరుతో ఒక కామాంధుడు మైనర్‌ బాలికకు వల వేశాడు. మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఖాజీపేటలో పెద్ద సంచలనంగా మారింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఖాజీపేట మండలం అగ్రహారానికి చెందిన కీర్తన అనే మైనర్‌ బాలిక హత్య సంఘటన మరువక ముందే.. తిరిగి మరొక మైనర్‌ బాలికపై అఘాయిత్యం జరగడం కలకలం రేపుతోంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వల్లూరు మండలం కోట్లూరు గ్రామానికి చెందిన ఈశ్వర్‌(19) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. గడిచిన 6 నెలల కిందట దువ్వూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక మైనర్‌ బాలిక(15)తో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయం చేసుకున్నాడు. అప్పటి నుంచి తరచూ ఆ బాలికతో చాటింగ్‌ చేస్తూ ఉండేవాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. సోమవారం ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బాలిక గుడుపాడు గ్రామానికి వెళ్లింది. కోట్లూరు గ్రామానికి చెందిన ఈశ్వర్‌ బైక్‌పై గుడిపాడు గ్రామానికి చేరుకున్నాడు. ఆ బాలికను అక్కడి నుంచి ఖాజీపేటలోని ఒక లాడ్జికి తీసుకుని వెళ్లాడు. అక్కడ అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో రుతుస్రావం జరిగినట్లుగా ఇద్దరూ భావించారు. తిరిగి బాలికను బైక్‌పై దువ్వూరు మండలంలోని ఒక గ్రామం వద్దకు తీసుకువచ్చి వదిలేసి వెళ్లాడు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక

రక్తస్రావం అధికంగా వస్తుండటంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు ఆ బాలిక తీసుకెళ్లింది. వెంటనే దువ్వూరులోని ఒక ఆర్‌ఎంపీ దగ్గరికి వారు తీసుకు వెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని ప్రొద్దుటూరుకు తీసుకు వెళ్లాలని ఆర్‌ఎంపీ సూచించాడు. వారు ప్రొద్దుటూరులోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు వారు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం కడప రిమ్స్‌కు తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు సోమవారం రాత్రి కడప రిమ్స్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతోంది. ప్రస్తుతం కోలుకుంటోంది.

బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు

ప్రేమ పేరుతో మైనర్‌ బాలికను తీసుకు వెళ్లి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కడప రిమ్స్‌లోని పోలీస్‌ ఔట్‌పోస్ట్‌లో ఫిర్యాదు చేశారు. అయితే తమ కూతురుపై జరిగిన సంఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగారు.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా లాడ్జిలు

ఖాజీపేటలో బైపాస్‌ రోడ్డు వద్ద ఉన్న లాడ్జిలు చాలా కాలంగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతోనే వారి ఆగడాలకు అంతులేకుండా పోయింది. లాడ్జిల్లో డబ్బులు ఇస్తే పేకాటతోపాటు అనేక కార్యకలాపాలు చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నారు. అందుకు నిదర్శనం గతంలో కూడా పేకాట ఆడుతూ పట్టుపడ్డ సంఘటలు ఉన్నాయి. బయటి నుంచి వస్తున్న వారికి ఎలాంటి గుర్తింపు కార్డులు లేకుండానే గదులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. అలా వచ్చిన వారు కేవలం గంట లేక రెండు గంటలు మాత్రమే లాడ్జిలో ఉంటూ తమ అవసరాలు తీరిన తరువాత ఖాళీ చేసి వెళ్తున్నట్లు తెలుస్తోంది. లాడ్జిల్లో ఎలాంటి కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పోలీసుల అదుపులో నిందితుడు

జరిగిన సంఘటనపై పోలీసులు వేగంగా స్పదించా రు. మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో తప్పును ఒప్పుకొన్నట్లు సమాచారం.

కేసు నమోదు చేసి, విచారణ

బాధిత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్‌ఐ ధనుంజయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు. చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం జరిగేలా చేస్తామని వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement