● పందుల చోరీకి యత్నం
● అడ్డుకున్న వారిపై
బీరు సీసాలు, రాళ్లతో దాడి
● ఒకరికి గాయాలు, పలు వాహనాలు ధ్వంసం
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున ఏడుగురు పందుల దొంగలు హల్‌చల్ సృష్టించారు. వెంబడిస్తున్న వాహనాలపై రాళ్లు, బీరు సీసాలు విసురుతూ, అడ్డు వచ్చిన వాహనాలను ఢీకొడుతూ పోలీసులు, ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. ఈ దాడులలో మూడు వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం ధ్వంసమయ్యాయి. ఇద్దరికి గాయాలయ్యాయి. బాధితుడు అంజనప్ప కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణంలోని చందమామ డాబా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున కొంత మంది వ్యక్తులు బొలెరో వాహనంలో పందులు పడుతుండడంతో స్థానికంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు మీరు అని ప్రశ్నించారు. దీంతో దుండగులు ఆయనపై బీరు సీసాలతో దాడి చేశారు. దీంతో ఆ వ్యక్తి పందుల యజమాని అంజనప్పకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న అంజనప్ప పోలీసులకు సమాచారమందించారు. అనంతరం తన కుమారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది గమనించిన దుండగులు వారిపై రాళ్లు, బీరు సీసాలు విసురుకుంటూ వెళుతూ గట్టిగా కేకలు వేస్తూ అధిక వేగంతో వాహనంలో పరారయ్యారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసుల సహాయంతో అంజనప్ప వారిని వెంబడించారు. ముదిగుబ్బ వైపు వెళ్తున్నారని సమాచారం రావడంతో.. దొంగల వాహనాన్ని పట్టుకునేందుకు పోలీసులు నల్లగొండువారిపల్లెలో ఒక వ్యక్తికి తెలియజేశారు. ఆ వ్యక్తి వారిని నిలిపేందుకు వెళ్లడంతో దుండగులు ఆయన వాహనాన్ని ఢీకొట్టి పరారయ్యారు. అనంతరం పోలీసులు అంబకపల్లె ప్రజలకు సమాచారమందించారు. అక్కడ ఉన్న ప్రజలు రోడ్డుకు అడ్డంగా పెద్ద, పెద్ద రాళ్లను అడ్డుపెట్టారు. అయినా వాటిని కూడా ఢీకొట్టి వాహనంలో పరారయ్యారు. మరో గ్రామం వద్ద ట్రాక్టర్ ట్రాలీని అడ్డు పెట్టడంతో ట్రాలీని ఢీకొట్టి ముదిగుబ్బ వైపు వెళ్లారు. దొంగల వాహనం వెంటే వారిని పట్టుకునేందుకు పోలీసు వాహనం, మరో వాహనంలో వెంబడించారు. పోలీసులను చూసి కూడా భయపడకుండా రాళ్లు, సీసాలు విసురుతూ బీభత్సం సృష్టించారు.
పోలీసులు వెంబడించినా..
దుండగులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఐ శ్రీరామ్ వారిని వెంబడిస్తూ వెళ్లారు. పోలీసు వాహనానికి, పందుల యజమాని వాహనానికి దొరక్కుండా దొంగలు వారి వాహనాలపై రాళ్లు, సీసాలు విసురుకుంటూ వెళ్లారు. బత్తలపల్లి సమీపంలో అంజనప్ప వాహనాన్ని వారు ఢీకొట్టడంతో పూర్తిగా ధ్వంసమైంది. ఈ సంఘటనతో దొంగల వాహనం కూడా పూర్తిగా ధ్వంసమై రోడ్డు పక్కన ఆగిపోయింది. పందుల దొంగలు ఇక రండిరా మా బార్డర్‌లోకి వచ్చారు... మీ కథ చూస్తామంటూ వారిపై రాళ్లు రువ్వడం మొదలుపెట్టారు. పందుల యజమానులు వాటిని లెక్కచేయకుండా వారిపైకి వెళ్లడంతో కొంత మంది పరుగులు తీయగా... వారిని పోలీసులు వెంబడించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని మిగతా వారిని పట్టుకునేందుకు సీఐ శ్రీరామ్ అనంతపురం చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పులివెందులలో రెండు మూడు జరిగినట్లు సమాచారం.


