రోడ్డు ప్రమాదంలో హిజ్రా దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో హిజ్రా దుర్మరణం

May 27 2026 5:56 AM | Updated on May 27 2026 5:56 AM

పెండ్లిమర్రి : మండల పరిధి కడప – పులివెందుల ప్రధాన రహదారిలోని ఇందిరానగర్‌ సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్‌ హాజివల్లి (40) అనే హిజ్రా దుర్మరణం చెందారు. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు... పులివెందుల నుంచి కడప వైపు వెళుతున్న కారు ఇందిరానగర్‌ సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్‌ వద్దకు రాగానే అదుపు తప్పి అక్కడే నిలిచి ఉన్న షేక్‌ హజీవల్లిని ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తులసి నాగప్రసాద్‌ తెలిపారు.

యువకుడి ఆత్మహత్య

కడప అర్బన్‌ : కడప నగర తాలూకా పీఎస్‌ పరిధిలో తీవ్ర అనారోగ్యంగా వుండే కారణంగా తలకు పూసుకునే రంగు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై రఫీ తెలిపారు. నంద్యాల జిల్లాకు చెందిన శ్రీనివాస్‌ నాయక్‌ (19) కడపలోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో చదువుకుంటున్నాడు. మరో యువకుడితో కలిసి ఉంటున్నాడు. వైద్యంకు కూడా తగ్గని జబ్బు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం కోసం రిమ్స్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బంగారు హారం చోరీ

ముద్దనూరు : ఆర్టీసీ బస్సులో వెళ్తున్న సోంపల్లెకు చెందిన సువర్ణ అనే మహిళ బంగారు హారం మంగళవారం రాత్రి చోరీకి గురైంది. బాధితుల వివరాల మేరకు.. సువర్ణ సోంపల్లెలోని తన పుట్టింటి నుంచి తొండూరు మండలం బూచుపల్లెకు బయలుదేరారు. ముద్దనూరు బస్టాండులో తన ఇద్దరు పిల్లలతో కలిసి బస్సు ఎక్కారు. ముద్దనూరు పాతబస్టాండులో బస్సు ఎక్కిన ఆమె టికెట్‌ ఇవ్వడానికి పర్సులోని ఆధార్‌కార్డు కోసం బ్యాగులో చూడగా పర్సు కనిపించలేదు. దీంతో పర్సు చోరీకి గురైనట్లు గుర్తించారు. పర్సులో ఆధార్‌కార్డుతోపాటు సుమారు 2 తులాల బంగారు హారం ఉంచినట్లు బాధితురాలు తెలిపారు. బస్సు ఎక్కిన వెంటనే గుర్తుతెలియని వ్యక్తులు బ్యాగులోని పర్సు దొంగలించినట్లు ఆమె పేర్కొన్నారు.

ఐరన్‌ మాయం ఘటనలో ఏఈపై కేసు

ప్రొద్దుటూరు క్రైం : హౌసింగ్‌ శాఖలోని ఐరన్‌ చోరీ అయిన ఘటనకు సంబంధించి రూరల్‌ హౌసింగ్‌ ఏఈ సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసినట్లు త్రీ టౌన్‌ సీఐ రామాంజనేయుడు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు.. హౌసింగ్‌కు సంబంధించిన ఐరన్‌ను మార్కెట్‌ యార్డు గోడౌన్‌లో భద్రపరిచారు. దీన్ని రూరల్‌ హౌసింగ్‌ ఏఈ సుబ్రమణ్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గోడౌన్‌లో ఉన్న 268.571 టన్నుల ఐరన్‌ కనిపించలేదు. ఈ విషయమై హౌసింగ్‌ జిల్లా పీడీ రాజారత్నం ఫిర్యాదు మేరకు మంగళవారం ఏఈ సుబ్రమణ్యంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు త్రీ టౌన్‌ సీఐ తెలిపారు.

కోడి పందెం ఆడుతున్న ఆరుగురి అరెస్ట్‌

రాయచోటి : రాయచోటి రూరల్‌ మండలం దిగువ అబ్బవరం గ్రామ పరిధిలో నిర్వహిస్తున్న కోడిపందెం (కాక్‌ ఫైట్‌) స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన దాడిలో ఆరుగురు పందెం రాయుళ్లను అరెస్టు చేసినట్లు రాయచోటి అర్బన్‌ పోలీసులు తెలిపారు. ఈ దాడిలో నాలుగు బైకులు, ఐదు సెల్‌ఫోన్లు, ఒక కోడి, వెయ్యి రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని బుధవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement