చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని గువ్వలచెరువు ఘాట్ రోడ్డు ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్‌ను తొలగించేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంగళవారం అగ్నిమాపక, ఐఓసీఎల్, పోలీసు అధికారులు గ్యాస్ ట్యాంకర్‌ను రెండు క్రేన్ల సాయంతో రోడ్డుపై నిలిపే ప్రయత్నంలో.. క్రేన్లు రోడ్డుపై విరిగిపడ్డాయి. దీంతో గ్యాస్ ట్యాంకర్ కూడా రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఒక క్రేన్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా హుటాహుటిన 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. పడిపోయిన ట్యాంకర్‌లో 18 టన్నుల గ్యాస్ నిల్వ ఉంది. ఐఓసీఎల్ అధికారులు రెండు ఖాళీ ట్యాంకర్లు తెప్పించి ఆ ట్యాంకర్ నుంచి గ్యాస్‌ను మార్చే ప్రయత్నం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ అవుతుందేమోనని అగ్నిమాపక యంత్రాలతోపాటు అవసరమైన పరికరాలను సంఘటనా స్థలంలో సిద్ధంగా ఉంచారు. రెండు ట్యాంకర్లలో 4 టన్నుల చొప్పున 8 టన్నుల గ్యాస్‌ను పడిపోయిన ట్యాంకర్ నుంచి మార్పు చేశారు. ఇంకా కొద్ది సేపు మార్పు చేసే ప్రయత్నం చేసి, మరో పెద్ద క్రేన్ ద్వారా తదుపరి పడిపోయిన గ్యాస్ ట్యాంకర్‌ను పైకి లేపే ప్రయత్నాలు చేయనున్నారు. ఘాట్ రోడ్డు మీదుగా వాహనాల రాకపోకలు నిలిపేసి ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. ఊటుకూరు రింగురోడ్డు సర్కిల్ వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి వాహనదారులకు రాకపోకలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి సిబ్బందితో రక్షణ చర్యలు, ట్రాఫిక్ నియంత్రణను పర్యవేక్షస్తున్నారు.
గువ్వలచెరువు ఘాట్‌లో ట్రాఫిక్ మళ్లింపు


