● తిరుపతి–విశాఖ మధ్య పరుగులు
● దారి మళ్లింపుతో జిల్లావాసులకు
తప్పని ప్రయాస
రాజంపేట : ముంబై–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపించాలని రైల్వేశాఖ యోచించడం లేదు. కొన్నేళ్ల క్రితం జిల్లా మీదుగా నడిచిన డబుల్ డెక్కర్ కనుమరుగైంది. దారి మళ్లింపు నిర్ణయంతో ఈ పరిస్థితి తలెత్తింది. త్వరలో కొత్తజోన్ కేంద్రంగా విశాఖపట్నం ఏర్పడుతుండటంతో తిరుపతి–విశాఖ మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్‌ను కడప వరకు పొడిగించాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది. వారానికి మూడురోజులు కాకుండా నిత్యం ఈ రైలును నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ కేంద్రంతో జిల్లా రైల్వే ఉద్యోగులు, కార్మికులు అవసరం లేకపోవడంతో ఇప్పుడు డబుల్ డెక్కర్ రైలు పొడిగిస్తే రాకపోకలకు మెరుగైన అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
గతంలో కాచిగూడ–తిరుపతి మధ్య నడిచిన డబుల్ డెక్కర్‌ను ఆదాయం రావడం లేదని జిల్లాకు ఈ రైలును దూరం చేశారు. హాల్టింగ్స్ ఇవ్వడంలో సడలింపు లేకపోవడంతోనే డబుల్ డెక్కర్‌ను ఈ మార్గంలో నడిపించలేకపోయారనే విమర్శలున్నాయి.
విశాఖ–తిరుపతి మధ్య నిత్యం రద్దీ
ఇప్పటికే విశాఖ – తిరుపతి మధ్య ఉన్న రైళ్లు చాలకపోవడంతో నెల రోజుల ముందే వెయింటింగ్ లిస్ట్ సిద్ధమవుతోంది. దీంతో ఈ మార్గంలో మరిన్ని రైళ్లు నడపాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డబుల్‌డెక్కర్ రైలును ఈ రద్దీ మార్గంలో నడపాలనే దిశగా అడుగులు వేయడానికి కారణమైంది.
కడప వరకు పొడిగిస్తే ప్రయాణికులకు ఊరట
వారంలో మూడురోజులు తిరుపతి–విశాఖపట్నం(22708) మధ్య నడిచే డబుల్ డెక్కర్ రైలు రాత్రి 10 గంటలకు విశాఖలో బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.30గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. రాత్రి తిరుపతిలో 9.40 గంటలకు విశాఖకు బయలుదేరుతుంది. ఈ ఖాళీ సమయంలో కడప వరకు డబుల్ డెక్కర్‌ను తీసుకొస్తే జిల్లా ప్రయాణికులకు ఉపయోగకరంగా ఉంటుంది.
తిరుపతిలో రాత్రి వరకు..
తిరుపతిలో డబుల్ డెక్కర్ రైలు రాత్రి వరకు లూప్‌లైనులో ఖాళీగా ఉంటోంది. దీనిని కడప వరకు పొడిగిస్తే విజయవాడ, విశాఖపట్నం వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుందని జిల్లా వాసులు కోరుతున్నారు. కడప, నందలూరు, రాజంపేట, రైల్వేకోడూరులో హాల్టింగ్ కల్పిస్తే రాజధానికి వెళ్లేందుకు మరో రైలు అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి సోమవారం, గురువారం, శనివారం రోజుల్లో. తిరుపతి నుంచి మంగళవారం, శుక్రవారం, ఆదివారం రోజుల్లో నడుస్తుంది. జూన్ 1 నుంచి ఎసీవోఆర్‌లో జిల్లా రైలు మార్గంలో విలీనం కావడం వల్ల ఈ రైలు అటు రైల్వే ఉద్యోగులు, కార్మికులతో పాటు విశాఖ, విజయవాడకు వెళ్లేందుకు దోహదపడుతుందనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
విజయవాడ వెళ్లేందుకు అనుకూలం
డబుల్ డెక్కర్ రైలును కడప వరకు పొడిగిస్తే రాజధాని, కొత్త రైల్వేజోన్ కేంద్రానికి వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుంది. ఒకప్పుడు జిల్లా మీదుగా పరుగులు తీసిన ఈ రైలును ప్రతి రోజూ నడిపిస్తే విజయవాడ వెళ్లేందుకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వేశాఖ కడపకు పొడిగింపు ప్రతిపాదన చేయాలి.
– షమీవుల్లాఖాన్, మాజీ ఏజీపీ, నందలూరు
రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి
జిల్లా మీదుగా వందేభారత్ రైలు ఇప్పట్లో నడిచే అవకాశాలు కనిపించడం లేదు. తిరుపతి–విశాఖ మధ్య నడిచే డబుల్‌డక్కర్‌ను కడప వరకు నడిపించేందుకు రైల్వేశాఖ చర్యలు తీసుకోవాలి. జిల్లా మీదుగా రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు సరైన రీతిలో రైళ్లు అందుబాటులేవు. ఉన్న తిరుమల గుంతకల్ వరకు పొడిగించడంతో ఆ రైలులో ప్రయాణం కష్టతరం.
– డా.బాలరాజు, రాష్ట్ర అధ్యక్షుడు, ఐఎంఏ, రాజంపేట


