చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులోని ఐదో మలుపు వద్ద సోమవారం మధ్యాహ్నం గ్యాస్ ట్యాంకర్ బోల్తాపడింది. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రక్షక్ వాహన సిబ్బంది నరసింహులు బాధితుడిని వెంటనే 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీస్, అగ్నిమాపక అధికారులు, ఐఓసిఎల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. సీకేదిన్నె మండల సీఐ బాలమద్దిలేటి ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ నియంత్రించి రవాణాకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఘటనా స్థలంలోనే ఫైర్ ఇంజిన్లు, సిబ్బందిని ఉంచి మంగళవారం గ్యాస్ ట్యాంకర్‌ను యథాస్థితికి తీసుకొస్తామని తెలిపారు.
కడప కేంద్ర కారాగారంలో ఖైదీ బెదిరింపులు
కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారంలో నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడకు పీడీయాక్ట్ (నిర్భంద) ఖైదీగా వచ్చిన రవి తాను ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను, సిబ్బందిని సోమవారం బెదిరించాడు. వివరాలిలా వున్నాయి. కడప కేంద్ర కారాగారంలో దాదాపు 60 మందికి పైగా నిర్భంద ఖైదీలు (పీడీయాక్ట్) ఉన్నారు. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన వారే 40 మంది ఉన్నారు. ఈక్రమంలో కడప కేంద్ర కారాగారం లోపల మరింత నిఘా పెంచాలని ఈనెల 24వ తేదీన సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. సాయంత్రం కేంద్ర కారాగారం సిబ్బందిలో ఒకరు పని వద్ద అడ్డు వస్తున్నాడని రవి అనే నిర్భంద ఖైదీని పక్కకు తోయడంతో కింద పడ్డాడు. సోమవారం అందరూ లాకప్ నుంచి బయటకు రాగానే సదరు నిర్భంద ఖైదీ బయటకు వచ్చాడు. కడప కేంద్ర కారాగారం లోపలి ఆవరణలో వున్న చెట్టు పైకి ఎక్కి తాను సిబ్బందిచేత వేధింపులకు గురయ్యానని, దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అక్కడే విధులను నిర్వహిస్తున్న సిబ్బంది అతనిని బతిమలాడి కిందకు దించారు.అధికారులు విషయం తెలుసుకుని ప్రధానగేటు వద్ద ఉన్న తమ కార్యాలయానికి పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ఈ వ్యవహారంపై కడప కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ రాజేశ్వరరావును వివరణ కోరగా సంఘటన జరగడం వాస్తమమేనన్నారు. అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించామన్నారు.
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
సదుం : సదుం మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు..సోమల మండలం గురికానివారిపల్లెకి చెందిన రాజశేఖర్ (31) సదుం మండలంలోని ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంలో ఇంటికి బయలు దేరాడు. నడిగడ్డ సమీపంలో గుర్తు తెలియని వాహనం బైక్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పీలేరు ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన వ్యక్తి..
రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఎస్‌ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు. గురువారం రాత్రి చైన్నై–అనంతపురం జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో గుర్తు తెలియని వాహనంపై నుంచి గుర్తు తెలియని వ్యక్తి కింద పడి గాయపడ్డారు. అతన్ని చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడని తెలిపారు. తిరుపతి మున్సిపాలిటీ అధికారుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేసినట్లు ఎస్‌ఐ వివరించారు.
● చెట్టు పైకెక్కి ఆత్మహత్యకు యత్నం
● కౌన్సెలింగ్ ఇచ్చిన అధికారులు
మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి
రాజశేఖర్
మృతదేహం


