కడప అర్బన్ : వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్‌న్‌లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోగా వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మొత్తం 156 ఫిర్యాదులు పీజీఆర్‌ఎస్‌కు వచ్చాయి. కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీంతో పాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
● ద్విచక్రవాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 158 కేసులు నమోదు చేసి, రూ. 43,060 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.
బక్రీద్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి
రానున్న బక్రీద్ పండుగ ను ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో హిందూ సంఘాల ప్రతినిధులతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకున్నామని, సీఐ టి.రెడ్డెప్పను నోడల్ అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఏదైనా సమాచారముంటే 9121100689 నంబర్‌కు తెలియచేయాలని సూచించారు. బక్రీద్ ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పోలీస్ శాఖకు తమ వంతు సహకారమందిస్తామని సమావేశానికి హాజరైన హిందూ సంఘాల ప్రతినిధులు హామీ ఇచ్చారు. సమావేశంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప ఇన్‌చార్జి డీఎస్పీ ఇ.బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


