రాయచోటి అర్బన్: పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెంచేస్తూ కూటమి ప్రభుత్వం సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెరుగుదలతో పాటు ప్రభుత్వాలు విధిస్తున్న భారీ పన్నుల భారం ప్రజలపై మోపడం దారుణమన్నారు. ఇంధన ధఱల పెరుగుదల ప్రభావంతో రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటున్నాయని, దీని వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పది రోజుల వ్యవధిలోనే నాలుగు సార్లు ఇంధన ధరలు పెంచారనన్నారు. మే 15న పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున పెంచగా, మే 19వ తేదీన పెట్రోల్‌పై మరో రూ.0.95లు, డీజిల్‌పై రూ.0.97లు పెంచారని తెలిపారు. మే 23న పెట్రోల్‌పై రూ.0.97లు, డీజిల్‌పై రూ.99లు పెంచి, మే 25న పెట్రోల్‌పై రూ.2.87లు, డీజిల్‌పై రూ.2.85లు ెపెంచారని వివరించారు. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక ఇంధన ధరలు ఉన్నాయని, పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలోనే పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు రూ.10లు వరకు ఎక్కువగా ఉన్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు కూటమి ప్రభుత్వం మద్దతు ఇస్తూ ప్రజలపై మరింత భారం మోపుతోందని మండిపడ్డారు. వెంటనే ఇంధన ధరల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడికోట శ్రీకాంత్ రెడ్డి డిమాండ్


