కడప అగ్రికల్చర్/కాశినాయన: ఖరీఫ్‌కు ముందే ఎరువుల ధరలు రైతులను బె‘ధర’గోడుతున్నాయి. ఒకవైపు పంటలు సరిగ్గా పండకపోవడం, మరో వైపు పండిన పంటలకు సరైన గిట్టుబాటు ధర లబించకపోవడంతో అన్నదాతలకు వ్యవసాయ సాగు భారంగా మారుతోంది. ఈ తరుణంలో మళ్లీ ఎరువుల ధరలు పెరగడంతో మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా రైతుల పరిస్థితి తయారైంది. ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కోసం ఎదురు చూస్తున్న సమయాన కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరగడంతో ఆందోళన చెందుతున్నారు. వైఎస్సార్‌జిల్లాలో ఈ ఖరీప్‌లో దాదాపు 80 వేల హెక్టార్లలో వరి, పత్తి, జొన్న, మినుములతోపాటు పలు పంటలు సాగుకానున్నాయి. దీంతో రైతులపై ఒక్క ఖరీప్ సీజన్‌లోనే దాదాపు రూ. 15 కోట్లు అదనపు భారం పడుతుంది. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతుండటంతో రైతుల్లో కలవరం మొదలైంది.
ఖరీఫ్‌సీజన్ జూన్ మొదటి వారం నుంచి ప్రారంభంకానుంది. రైతులు దుక్కులు దున్నడం కోసం తొలకరి వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్‌లో 79,773 హెక్టార్లలో వరి, పత్తి, మినుము, జొన్న, పసుపుతోపాటు పలు రకాల పంటలు సాగుకానున్నాయి. సాగుకు ముందే ఎరువుల ధరలు పెరగడంతో రైతులు అందోళన చెందుతున్నారు. గతేడాది ఖరీప్ సీజన్‌లో మోంథా తుపాన్‌తో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన అధిక వర్షాలకు 1944 హెక్టార్లలో వరితోపాటు పలు పంటలు దెబ్బతిని రూ. 480 లక్షల మేర రైతులకు నష్టం జరిగి రైతులు విలవిల్లాడిపోయారు. ఇందుకు సంబంధించి నెలలు దాటుతున్నా ప్రభుత్వం పంటనష్ట పరిహారాన్ని అందించకపోవడంతో రైతులు ఆర్థికంగా చితికిపోయారు.గత ఏడాది ఖరీఫ్, రబీ ప్రారంభంలో ఎరువుల ధరల పెంచి నాలుగైదు నెలల వ్యవధిలోనే మళ్లీ పెంచి ప్రభుత్వం రైతులపై భారం మోపింది. ఖరీఫ్ సీజన్ మొత్తం 88 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. ఇందులో 40 వేల మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరంగా ఉంది. ఎరువుల ధరలు బస్తాకు వివిధ కంపెనీలను బట్టి 50 కిలోల బస్తాపై రూ. 75 నుంచి 350 వరకు ధర పెరగడం రైతుల్లో కలవరం రేపుతోంది.
నాడు అందుబాటులో ఎరువులు
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో 2019 – 24 వరకు ఎరువుల ధరలు నిలకడగా ఉన్నాయి. వ్యాపారుల నుంచి రైతులను కాపాడేందుకు ఆర్బీకేల ద్వారా రైతులకు ఎరువులను అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నిర్వీర్యం చేసింది.
రైతుల్లో ఆందోళన
ఎరువుల ధరలు పెరడంతో రైతులకు వ్యవసాయం భారంగా మారుతోంది. బస్తాకు రూ. 75 నుంచి రూ. 350 వరకు పెంచడం దారునం. పంటలసాగుకు అప్పులు చేసి పంటలను సాగు చేసుకునే పరిస్థితి నెలకొడటంతో రైతులు అందోళన చెందుతున్నారు.
– దస్తిగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి
సాగు ఖర్చులు పెరిగాయి
ఎరువుల ధరలతోపాటు కూలి, వ్యవసాయ యంత్రాల బాడుగల ధరలు పెరిగాయి. దీంతో వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. పంట సాగు చేసేకంటే కూలి పనులకు వెళ్లడం నయం అన్నట్లు పరిస్థితి నెలకొంది. ఎరువుల ధరలు తగ్గించాలి. – పి.జగన్‌మోహన్‌రెడ్డి,
రైతు, మిద్దెల, కాశినాయన మండలం.
పంటలకు గిట్టుబాటు ధర లేదు
ఏ పంట సాగు చేసినా గిట్టుబాటు ధరలు లేవు. ఒక వైపు రైతులకు సాగు ఖర్చులు ఏటా పెరుగుతున్నాయి.గోరుచుట్టుపై రోకటి పోటులా ప్రభుత్వం ఎరువుల ధరలుపెంచడం దారుణం. గత ప్రభుత్వంలో ఆర్‌బీకేలోనే ఎరువులను అందించేవారు. –ఎ.రామలక్ష్మిరెడ్డి,
వైఎస్సార్‌సీపీ రైతు విభాగం మండల అధ్యక్షుడు
పంటలసాగు కష్టమే...
పెరిగిన ఎరువుల ధరలో పంటలసాగు కష్టంగా మారనుంది. ఇప్పటికే రెండు సార్లు ఎరువుల ధరలు పెంచారు. కానీ రైతు పండించిన పంటలకు మాత్రం సరైన గిట్టుబాటు ధర కూడా కారవడంతోలేదు. దీంతో సాగు భారంగా మారుతుంది. – నాగేశ్వరెడ్డి,
కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
ఖరీఫ్ ప్రారంభానికి ముందేరైతులపై ఎరువుల బరువు
20.20.0.13 1450 1800
16.20.0.13 1400 1750
14.35.14 2150 2350
15.15.15 1650 1950
10.26.26 1950 2250
19.19.19 2075 2300
16.16.16 1675 1950


