ప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్‌లో మూడు రోజులుగా జరుగుతున్న మొదటి జాతీయ స్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ పోటీల్లో 12 రాష్ట్రాలకు చెందిన 954 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. క్యాడెట్, జూనియర్, సబ్ జూనియర్, సీనియర్ విభాగాల్లో తైక్వాండో పోటీలు నిర్వహించారు. ముగింపు వేడుకలలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. అనంతరం విజేతలకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తైక్వాండో కోచ్‌లు, క్రీడాకారులు ప్రదర్శించిన ఐస్ క్యూబ్‌లను పగలగొట్టడం, ఛాతిపై బండలను పగలగొట్టించుకోవడం, జంపింగ్ కిక్స్, నాంచాక్ విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. పట్టణంలో ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు తన వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తనను కలిసిన క్రీడాకారులకు ఎంపీ భరోసా ఇచ్చారు. ఈ జాతీయ స్థాయి తైక్వాండో ఛాంపియన్ షిప్ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్ షిప్ తెలంగాణ క్రీడాకారులు కై వసం చేసుకోగా, ద్వితీయ స్థానంలో తమిళనాడు, తృతీయ స్థానంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు నిలిచారు. వ్యక్తిగత ఛాంపియన్ షాప్‌ను తెలంగాణ క్రీడాకారులు సాధించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్‌రెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ మెట్టుపల్లె ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫైటింగ్ చేస్తున్న క్రీడాకారులు, టాక్టిక్ ఫైటింగ్ విభాగంలో విజేతలుగా నిలిచిన తమిళనాడు క్రీడాకారులకు బహుమతులు అందిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
విజేతలకు బహుమతులు అందించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


