కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల బదిలీలపై మళ్లీ అనిశ్చితి నెలకొంది. బదిలీలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టీచర్ల ఆశలపై సర్కార్ నీళ్లు చల్లింది. మేము అధికారంలోకి వస్తే ఏటా బదిలీలు నిర్వహిస్తామంటూ గొప్పలు చెప్పిన మంత్రి ఈ సారికి సర్దుబాటుతో సరిపెట్టాలని నిర్ణయించున్నట్లు తెలిసింది. దీంతో దాదాపు నాలుగు వేల మంది అయ్యవార్ల అశలు అడియాసలయ్యాయి. వేసవి సెలవులు ప్రారంభమై నెల రోజులు కావస్తోంది. కానీ ఉపాధ్యాయుల బదిలీల ఊసేలేదు. పైగా బదిలీలకు బదులు సర్దుబాటు అనే కొత్త అంశం తెరపైకి వచ్చింది. ఈ సారి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన బదిలీలు చేపట్టాలని, పాఠశాలల్లో పిల్లల సంఖ్యను బట్టి టీచర్లను సర్దుబాటు చేయాలని కూటమి సర్కార్ యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు గైడ్‌లైన్స్ కూడా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఉపాధ్యాయుల్లో అందోళన నెలకొంది.
జిల్లాస్థాయిలోనే సర్థుబాటు..
జిల్లాల పునర్విభజనతో వేసవి సెలవుల్లో చేపట్టాల్సిన ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు బ్రేక్ పడింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీనియారిటి జాబితా, పాఠశాలల వారిగా విద్యార్థుల సంఖ్య వంటి గణాంకాలను విద్యాశాఖ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది, ఏయే పాఠశాలల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు.. అక్కడ ఎంతమంది ఉపాధ్యాయుల పనిచేస్తున్నారు.. ఇంకా పోస్టులేమైనా అవసరమా.. లేకుంటే మిగిలిన పోస్టులను ఎక్కడ సర్దుభాటు చేయాలి వంటి అంశాలపై విద్యా శాఖ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు జూన్ నెలలో పాఠశాలలు పునః ప్రారంభం నాటికి సర్ధుబాటు చేసే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది.
గతేడాది టీచర్ల బదిలీల సమయంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియ మించడంతోపాటు ప్రత్యేకంగా హెచ్‌ఎం పోస్టు కేటాయించి హెచ్‌ఎంగా స్కూల్ అసిస్టెంట్‌ను నియమించారు. ఈ సారి మోడల్ స్కూళ్లలో 40 మంది లోపు విద్యార్థులుంటే అక్కడున్న హెచ్‌ఎం పోస్టు రద్దు చేయాలని సర్కార్ ఆదేశించింది. సర్దుబాటు క్రమంలో అక్కడున్న హెచ్‌ఎంను ఎక్కడికి పంపుతారో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వారిలో అందోళన నెలకొంది.
నాలుగు వేల మంది ఎదురు చూపు..
జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 7276 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. వీరిలో ఒకే చోట ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు తప్పని సరిగా బదిలీ కావాల్సి ఉంది, అలాగే ఒకే స్కూల్‌లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు, ఇలాంటి వారు జిల్లాలో దాదాపు నాలుగు వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి ఆ శలపై ప్రభుత్వం సర్దుబాటు పేరుతో నీళ్లు చల్లింది.
బదిలీ అయినా బాధలు తప్పడం లేదు..
గతేడాది బదిలీల్లో ఉమ్మడి జిల్లాలో 171 మంది ఉపాధ్యాయులు పలు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. వారికి రిలీవర్ రాకపోవడంతో బదిలీ అయిన స్థానాలకు వెళ్లలేక అక్కడే ఉండి పాత స్థానాల్లో పనిచేస్తున్నారు. దీంతో బదిలీ వచ్చినా లాభం లేదని, ఏడాదంతా కష్టాలు పడ్డామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా మా కష్టాలు తీరుతాయా లేదా అని ఎదురుచూస్తున్నారు. ఈ సర్దుబాటులోనైనా మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
పాఠశాలలు పునఃప్రారంభం తర్వాతే..
ఉపాధ్యాయులందరూ ఉమ్మడి వైఎస్సార్‌జిల్లా ప్రాతిపదికన నియామకాలు పొందారు. అదే ప్రాతిపదికన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ ఈ సారి ప్రభుత్వం కొత్త జిల్లా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సారి నూతన జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు సర్దుబాటు చేయనున్నారు. ఈ పక్రియ మొత్తాన్ని జూన్ మొదటి వారంలో పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించినప్పటికి పాఠశాలలు పునః ప్రారంభమైతే కానీ ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పక్కాగా తెలియదు. అందువల్ల పాఠశాలల పునఃప్రారంభం తర్వాతే సర్దుబాటు చేయనున్నారు.
సర్దుబాటుతో సరి.. ఈ ఏడాది టీచర్ల బదిలీలు లేనట్లేనా..
కొత్త జిల్లా ప్రాతిపదికన సర్దుబాటుకు సర్కారు అడుగులు?
కసరత్తు చేస్తున్న విద్యాశాఖ
ఇంకా గైడ్ లైన్స్ రాలేదు..
ఈ సారి ఉపాధ్యాయ బదిలీలా లేక సర్దుభాటా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం ఎలా చేయమని చెబితే అందుకు తగ్గ వివరాలను సేకరించి ముందుకు సాగుతాం.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి


