చాపాడు : మండల పరిధిలోని చియ్యపాడు దళిత వాడకు చెందిన గొల్లపల్లి నందిని (18) అనే యువతి కనిపించడం లేదని ఏఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. కడప సమీపంలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేస్తున్న నందిని శనివారం నుంచి కనిపించడం లేదని తల్లి రమాదేవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.
వీరపునాయునిపల్లె : స్థానిక పోలీస్టేషన్‌లో ఆదివారం అదృశ్యం కేసు నమోదైనట్లు ఎస్‌ఐ కృష్ణయ్య తెలిపారు. వివరాలు.. మండలంలోని కొమ్మద్ది గ్రామానికి చెందిన నిమ్మకాయల నరేంద్రరెడ్డి(31) కుటుంబ సమస్యల కారణంగా 19వ తేదీన ప్రొద్దుటూరుకు వెళుతున్నానని చెప్పి బయలుదేరాడు. ఆ రోజు నుంచి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికారు. ఆచూకీ లబించకపోవడంతో అతని తండ్రి రమణారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఇతని ఆచూకీ తెలిసిన వారు 9121100534కు సమాచారం అందించాలని ఆయన తెలిపారు.
ఏకగ్రీవ ఎన్నిక
రాజంపేట : వైఎస్సార్ కడప జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక గ్రామానికి చెందిన బాలరాజు చంద్రశేఖర్‌రాజు కువైట్ తెలుగు కళాసమితి నూతన అధ్యక్షుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ విషయాన్ని టీకెఎస్ (కువైట్ తెలుగుసమితి) తెలియచేసింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికై న ఒకే ఒక్కడు చంద్రశేఖర్‌రాజు కావడం గమనార్హం. ఆయన ఇక్కడి విలేకర్లతో మాట్లాడుతూ తెలుగుభాష సంస్కృతుల వైభవాన్ని యువతరానికి చేరవేయడానికి కృషిచేస్తానన్నారు.
గాయపడిన జింక
జమ్మలమడుగు : పెద్దముడియం మండలం కల్వటాల గ్రామ సమీపంలో ఉన్న సోలార్ ప్యానల్స్‌లో దూరి జింకకు తీవ్ర గాయాలయ్యాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న సెక్యూరిటీ మాధవ మునిరెడ్డి తన సిబ్బందితో కలిసి దానిని రక్షించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఫారెస్టు అధికారులు గాయాలైన జింకకు పశుసంవర్థకశాఖ వైద్యులతో వైద్యం చేయించారు. అనంతరం అడవిలో వదిలేశారు.
వడదెబ్బతో వ్యక్తి మృతి
బద్వేలు (అట్లూరు) : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు చెన్నంపల్లె సమీపంలో ఉన్న జగనన్న కాలనీకి చెందిన జయచంద్ర రాజు (39) ఆదివారం వడదెబ్బతో మృతి చెందాడు. జయచంద్రరాజు పెయింట్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. రోజు లాగానే ఆదివారం పెయింట్ పని చేసేందుకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని వారు పేర్కొన్నారు.


