● బోయకొండలో ఊహించని రీతిలో రద్దీ
● సుమారు 25 వేల మంది హాజరు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం ఊహించని రీతిలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి సుమారు 25 వేల మంది తరలివచ్చారని ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయంలో టికెట్లు పంపిణీ చేసే సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి ఇబ్బందులు పడాల్సివచ్చింది. సర్వర్లు మోరాయించడంతో అధికారులు మ్యాన్యువల్ టికెట్లను పంపిణీ చేశారు. ఆలయంతోపాటు పరిసర ప్రాంతంలో మౌలిక వసతులతోపాటు తాగునీటి కోసం భక్తులు అవస్థలు పడ్డారు. కొందరు భక్తుల అవసరాలను ఆసరాగా చేసుకొని చేతివాటం చూపారు. కూల్‌డ్రింక్స్, తాగునీటిని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించారు. కోరికలు తీరిన వారు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రసాదాల కౌంటర్‌లో టికెట్లు లేక ప్రసాదాలు తీసుకోకుండానే నిరాశతో వెనుతిరిగారు.దీంతో ప్రసాదాల కౌంటర్ ఖాళీగా కనిపించింది. ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడ్డారు.
ఒక్కరోజు ఆదాయం.. రూ:20 లక్షలు
బోయకొండ ఆలయం వద్ద వివిధ రకాల సేవా టికెట్ల విక్రయాల ద్వారా ఆలయానికి ఆదివారం రూ:20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని రాబో యే రోజుల్లో ఏర్పాట్లపై దృష్టిసారిస్తామని చెప్పారు.


