జమ్మలమడుగు రూరల్ : దాడిలో గాయపడిన మహిళ కర్నూలులో చికిత్స పొందుతూ మృతి చెందింది. సీఐ నరేష్‌బాబు కథనం మేరకు.. పట్టణంలోని నాగలకట్ట వీధికి చెందిన లక్ష్మీదేవిపై భర్త వెంకటేశ్వరెడ్డి కుటుంబ సమస్యల కారణంగా గొడ్డలితో దాడిచేయడంతో మహిళ తీవ్రగాయాలపాలైంది. జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీదేవి ఆదివారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. వెంకటేశ్వరరెడ్డి పోలీసులకు లోంగిపోయినట్లు తెలిసింది.
బావిలో ఈతకు వెళ్లి ..
కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మోడమీద పల్లి సమీపంలో బావిలో ఈతకు వెళ్లి కడపకు చెందిన థామస్(36) మృతి చెందాడు. థామస్ ఆదివారం తన స్నేహితులతో కలిసి మధ్యాహ్నం ఈతకు వెళ్లారు. అందరూ బావి బయట ఉండగా థామస్ బావిలోకి దిగి ఈత కొడుతున్న సమయంలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ఊపిరాడలేదు. అక్కడికక్కడే మృతి చెందాడు. స్నేహితులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు థామస్ మృతదేహాన్ని వెలికితీయించి రిమ్స్ మార్చురీకి పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ సంఘటనపై మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు చిన్న చౌక్ ఎస్‌ఐ హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు.


