శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి
కడప సెవెన్‌రోడ్స్: ప్రతి ఒక్కరూ ఆచారాల వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంచుకుని,సమాజంపై బాధ్యతగా వ్యవహరిస్తూ బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా జరుపుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఈ నెల 28న జరగనున్న బక్రీద్ పండుగ సందర్భంగా శనివారం కలెక్టరేట్‌లో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తదితర శాఖల అధికారులు, అన్ని మతాల మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జంతువధ శాలల వద్ద ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలను ప్రతి ఒక్కరు తప్పక పాటించాలన్నారు. అన్ని మతాల ప్రజలు సహనం, సంయమనంతో సంతోషంగా సాంప్రదాయాలను గౌరవించుకుంటూ బక్రీద్ పండుగ ను నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగిస్తున్న యువతను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. స్లాటర్ హౌస్‌ల వద్ద శానిటేషన్, మంచినీటి సరఫరా చేయాలని,అలాగే అంతరాయం లేని నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ సందర్భంగా ఎక్కడ ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను చేస్తామని అన్నారు. ఏదైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి హిదాయతుల్లా, ప్రాసిక్యూట్ అడ్మిన్ డీడీ, రెవిన్యూ, పోలీస్, ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖ, పంచాయతీ శాఖ, ఫైర్ శాఖ అధికారులు జిల్లా అధికారులు,పీస్ కమిటీ సభ్యులు, అన్ని మతాల మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా జలధార
రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో జలధార కార్యక్రమాన్ని ప్రణాళికబద్దంగా చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం జలధార–జలహారతి కార్యక్రమంపై జల వనరులశాఖ రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా చెరువుల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని తెలిపారు. జిల్లాలో 670 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, ఆయా గ్రామాల జలధార ప్రణాళిక పరిధిలోకి వాటిని తీసుకొచ్చామన్నారు. ఈ మేరకు అన్ని మండలాల్లో జలధార పనులు 60 శాతం మేర గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు.


