రాయచోటి టౌన్: బీసీల కులగణనను అవకతవకలకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇడగొట్టు నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం డెడికేటేడ్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రాకు మెయిల్ ద్వారా పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి దశలో గృహ గణన ఫార్మేట్‌లో ఓబీసీల గృహ గణన లెక్కించే కాలమ్ లేకపోవడం సరికాదన్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించిన జనగణన వివరాలు బీసీ కుల గణనతో సహా అన్ని స్థాయిల పాలన కేంద్రాలలో నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని కోరారు.
సాక్షి, మదనపల్లె: బి.కొత్తకోట మండలం పర్యాటక కేంద్రమైన హార్సీలీహిల్స్‌పై వెలసిన ఏనుగు మల్లమ్మ జాతర ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికోసం ఆలయ నిర్వా హకులు విశేష ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. మూడు రోజులపాటు జరిగే జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆదివారం అశ్వ వాహనం, సోమవారం గజవాహనం, మంగళవారం హంస వాహనంపై మల్లమ్మ ఉత్సవ విగ్ర హాన్ని ఊరేగించనున్నారు.
రాయచోటి: ఈవీఎంలను భద్రపరిచిన గోదాము వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును శనివారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తనిఖీలను చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఎ శ్రీనివాస్, తహశీల్దార్ నరసింహ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


