● పాపం.. సుబ్బలక్షుమ్మ | - | Sakshi
Sakshi News home page

● పాపం.. సుబ్బలక్షుమ్మ

May 24 2026 1:45 AM | Updated on May 24 2026 1:45 AM

బహరైన్‌లో బతుకు పోరాటం

మానవత్వం చాటిన వైఎస్సార్‌సీపీ బహ్రెయిన్‌ సభ్యులు

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బహరైన్‌ సభ్యులు మానవత్వాన్ని చాటుకున్నారు. వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌, బహ్రెయిన్‌ కన్వీనర్‌ ఓర్సు నాగరాజు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం బొజ్జవారి పల్లి రాఘవరాజాపురానికి చెందిన తుమ్మలూరు సుబ్బలక్షుమ్మ పది సంవత్సరాలుగా బహ్రెయిన్‌లో పనిచేస్తున్నారు. 6 నెలల క్రితం అక్కడ రోడ్డు దాటుతుండగా కారు ప్రమాదానికి గురై కోమాలోకి పోయింది. ఆసుపత్రిలో ఎవరూ పట్టించుకోకపోవడంతో ఒక అనాథలాగా ఉండేవారు. ఆమె సల్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయాన్ని కేరళకు చెందిన హాప్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, బహ్రెయిన్‌ సభ్యులు సుబ్బు, సుధీర్‌, షాజీ తెలుసుకొని వైఎస్సార్‌సీపీ బహ్రెయిన్‌ కన్వీనర్‌ ఓర్సు నాగరాజుకు తెలిపారు. ఆయన ఆసుపత్రికి వెళ్లి ఆమెను పరామర్శించారు. సుబ్బలక్షుమ్మ కోమా నుంచి బయటకు వచ్చినా మాట్లాడలేదని, నడవలేదని వైద్యులు తెలిపారు. ఆమె భర్త చాలా ఏళ్లక్రితమే చనిపోయాడు, పిల్లలు, అమ్మనాన్నలు, అన్నదమ్ములు లేరు. ఆమెను ఇండియా పంపడానికి ప్రయాణ ఖర్చులు భారత రాయబార కార్యాలయం ఇస్తుంది. ప్రతినెలా అయ్యే ఖర్చు బహ్రెయిన్‌ కమిటీ సభ్యులు భరిస్తారని తెలిపినా ఆమెను చూసుకునేందుకు బంధువులెవరూ ముందుకు రాలేదని తెలిసింది. ఆమె దీన స్థితిని చూసి చలించిపోయిన నాగరాజు మహిళా కార్యకర్తలతో ఆమెకు భోజనం తినిపిస్తూ, బిగుసుకుపోయిన కాళ్లు, చేతులకు ప్రతిరోజూ ఆయిల్‌ మసాజ్‌ చేయించారు. వారి సేవలతో ఆమె కాస్తా మాట్లాడే స్థితికి వచ్చారు.ఇటీవల వైఎస్సార్‌సీపీ సర్వసభ్య సమావేశానికి వెళ్లినప్పుడు ఆ పార్టీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌, కో కన్వీనర్‌ గోవిందు నాగరాజు ఆసుపత్రి వద్దకు వెళ్లి ఆమెను పరామర్శించి, ఆంధ్రప్రదేశ్‌లో ఏదైనా అనాథ ఆశ్రమంలో చేర్చాలని ప్రయత్నాలు చేశారు. చివరకు వైఎస్సార్‌ కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం, తిప్పలూరు గ్రామ సమీపంలో ఉన్న ఎద్దుల పెద్ద శేషమ్మ ఫౌండేషన్‌ చైర్మన్‌ ఏ. నాగేంద్ర ఆమెను ఆశ్రమంలో చేర్చుకునేందుకు అంగీకరించారు. ప్రతి నెల ఆమెకు అయ్యే ఖర్చులను నాగరాజు ద్వారా ఎద్దుల పెద్ద శేషమ్మ ఫౌండేషన్‌కు అందిస్తామని కమిటీ సభ్యులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ గల్ఫ్‌ కన్వీనర్‌ బీహెచ్‌ ఇలియాస్‌ మాట్లాడుతూ సుబ్బలక్షుమ్మను ఆదుకోవాడానికి ముందుకు వచ్చి సేవలు చేసిన బహ్రయిన్‌ కన్వీనర్‌, కమిటీ సభ్యులు, భారత రాయబార అధికారులు, హాఫ్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement