ఎర్రగుంట్ల : చాగలమర్రి నుంచి వేంపల్లె, రాయచోటి మధ్య నిర్మించే జాతీయ రహదారి కోసం భూముల సేకరణ విషయంపై శనివారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు, వై కోడూరు, పోట్లదుర్తి, ఎర్రగుంట్ల గ్రామాలకు చెందిన భూనిర్వాసితులతో డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి ఆధ్వర్యంలో తాహసీల్దార్ అమరేశ్వరి, జాతీయ రహాదారి శాఖ డీఈ చంద్రశేఖర్‌రెడ్డిలు సమావేశం నిర్వహించారు. వై కోడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు రైతుల పక్షాన మాట్లాడారు. అధికారులకు ఒత్తిళ్లు ఉన్నాయంటూ హడావిడిగా సమావేశం పెట్టి రైతులతో బలవంతంగా భూములు సేకరణ చేస్తుంన్నారన్నారు. ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్డు వేస్తే మా భూములలో నుంచి నీరు పోవడానికి డ్రైనేజీతో పాటు సర్వీస్ రోడ్లును ఏర్పాటు చేయాలన్నారు. మా తాతా ముత్తాలు సంపాదించిన భూములను మీకు అప్పనంగా ఇవ్వలేమన్నారు. దీంతో అధికారులు ఏమీ మాట్లాడకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. అలాగే పెద్దనపాడు గ్రామంలో రైతులు ఎకరాకు రూ.1.20 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపున రూ.92 లక్షలు ఇస్తామని చెప్పడంతో నష్టపరిహారంలో తేడాలు ఉండటంతో భూములు ఇవ్వలేమని రైతులు చెప్పారు. ఎర్రగుంట్ల పోట్లదుర్తి గ్రామాలకు చెందిన రైతులతో కూడా అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ రైతుల వద్ద నుంచి భూ సేకరణ విషయంలో ఆనాసక్తి ఎదురైంది.


