కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరా యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణం రోజున ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, కళ్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పీ బి.రమణయ్య, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విభుకృష్ణ, రాజంపేట ఏ.ఎస్.పీ హెగ్డే పాల్గొన్నారు.
పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో
ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్


