సాక్షి టాస్క్‌ఫోర్స్ : సింహాద్రిపురం మండలం కసనూరు – అంకాలమ్మ గూడూరు రోడ్డు సమీపంలోని తోటలలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. జూదమాడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.19వేలు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. కసనూరు గ్రామ సమీపంలోని తోటలో గత కొన్ని నెలలుగా టీడీపీ నాయకుని ఆధ్వర్యంలో జూదం జరుగుతోంది. ఈ ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని నెలలుగా అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు గురువారం దాడులు జరిపారు. గురువారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు జూదశాలపై దాడి చేశారు. జూదమాడతూ 40మంది పట్టుబడటమే కాకుండా పెద్ద ఎత్తున నగదు దొరికినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు కంటి తుడుపు చర్యగా నలుగురిపై కేసు నమోదు చేసి రూ.19వేల నగదు దొరికినట్లు చూపించారు. నిందితులను పోలీసులు తప్పించినట్లు సమాచారం. పోలీసులు తూతూ మంత్రంగా దాడులు చేయడంపట్ల పలువురు పెదవి విరుస్తున్నారు.
స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో ప్రతిభ
కడప ఎడ్యుకేషన్: కేరళ రాష్ట్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన ఆల్ ఇండియా సౌత్ జోన్ నేషనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్‌లో కడప మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి సి. శిరీష ప్రతిభ చాటి ఆల్ ఇండియా స్థాయిలో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. 800 మీటర్ల పరుగుపందెంలో శీరీష సత్తా చాటిందన్నారు. భవ్య శ్రీ లాంగ్‌జంప్‌లో రెండో స్థానంలో, బి. భవ్యశ్రీ 200 మీటర్ల పరుగుపందెంలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. నాగేశ్వరి వాలీబాల్ టీం విన్నర్‌గా నిలిచిందన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు.


