● గోడౌన్‌లో నిల్వలు సక్రమంగా ఉన్నాయన్న జిల్లా మేనేజర్
● వ్యత్యాసం ఉందన్న విజిలెన్స్ అధికారులు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని పౌరసఫరాల సంస్థ గోడౌన్‌లో సంస్థ జిల్లా మేనేజర్ నాగ సుధ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిల్వలను పరిశీలించారు. పరిశీలన అనంతరం జిల్లా మేనేజర్‌ను మీడియా ప్రతినిధులు వివరాలను కోరగా గోడౌన్‌లో నిత్యావసర వస్తువుల నిల్వలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేసి గోడౌన్‌లో ఉన్న నిల్వల్లో భారీగా వ్యత్యాసం ఉందని ఇచ్చిన నివేదికపై వివరణ కోరగా మాకు వారు ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తమ అధికారులతో కూడా సంతకాలు తీసుకోలేదని తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి విషయం తెలిపామన్నారు. జేసీ సూచనల మేరకే ఈ రోజు గోడౌన్‌లో తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నాగసుధతోపాటు ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్య, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు.
విజిలెన్స్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు
విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. బస్తాలను లెక్కించారు. గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ లింగస్వామి, గోడౌన్ సిబ్బంది సమక్షంలోనే తనిఖీలు నిర్వహించారు. నిల్వలలో 50.2 క్వింటాలు బియ్యం, 43 క్వింటాలు చక్కెర, 7 క్వింటాలు జొన్నలు, తదితర నిత్యావసర వస్తువుల్లో తేడాలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లా మేనేజర్ నాగ సుధ నిల్వలన్నీ కరెక్ట్‌గా ఉన్నాయని, కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందని అన్నారు. రెండు శాఖల అధికారులు వేర్వేరుగా ఇచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏమి జరిగింది.. ఎలా జరిగిందనేదానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.


