కడప సెవెన్‌రోడ్స్ : పీఎన్‌జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా ఎల్పీజీకి బదులుగా పీఎన్‌జీ వినియోగానికి బదిలీ కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వినియోగదారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో ఎల్పీజీ గ్యాస్‌కు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో అందుబాటులో ఉన్న పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచేందుకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధీమీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వంట గ్యాస్ కొరత కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా మారిపోవాల్సి ఉంటుంది. వారందరికీ అతి త్వరలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరా ఆగిపోనుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ప్రస్తుతం కడప నగరంలోని అన్ని గృహ అవసరాలకు తప్పనిసరిగా పీఎస్జీని ఉపయోగించుకునే విధంగా నగరపాలక సంస్థ అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో థింక్ గ్యాస్ జిల్లా మేనేజర్ విజయ్ మోహన్ పీఎన్జీ వాడకం, ఉపయోగాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలు, లాభాలు మొదలైన అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. పలువురు హోటల్స్ యాజమాన్య కమిటీ వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ: 1800 2021 999, 9010926528లో సంప్రదించాలన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


