రాష్ట్రంలో అరాచక పాలన
దేవుడితో రాజకీయాలు చేస్తున్నారు
● రెండేళ్లలో రూ. 3.12లక్షల కోట్ల అప్పు
● అయినా అభివృద్ధి పనుల జాడే లేదు
● కూటమి పాలనపై వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజం
కమలాపురం : రాష్ట్రంలో అరాచక రెడ్‌బుక్ పాలన సాగుతోందని, అభివృద్ధి పనుల అడ్రస్ గల్లంతైందని, సంక్షేమం గాలికి వదిలేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా మేనిఫెస్టోలోని ఒక్క హామీ పూర్తిగా అమలు చేయలేదని ధ్వజమెత్తారు. జగనన్న తన ఐదేళ్లలో పాలనలో రూ. 3.27లక్షల కోట్లు అప్పు చేశారని, ఇందులో రూ.2లక్షల కోట్లకు పైగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోనే నిధులు జమ చేశారన్నారు. మరో లక్ష కోట్లకు పైగా నాన్ డీబీటీ ద్వారా సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. కూటమి పాలన ఇంకా రెండేళ్లు పూర్తి కాకున్నా ఇప్పటికే రూ. 3.12 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. అయినా సంక్షేమ పథకాల జాడే లేదని, అభివృద్ధి అడ్రస్ గల్లంతైదని మండిపడ్డారు. అమరావతి సహా ఏ ప్రాంతం అభివృద్ధి చెందలేదన్నారు. మరి ఈ డబ్బంతా ఏమైందని ప్రశ్నించారు. చేసిన అప్పులో ప్రజలకు అరకొర విదిలించి కూటమి నాయకులు దోచుకుతింటున్నారని ఆరోపించారు. సీఎం స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయి వరకు దోచుకు తినడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి, గ్రావెల్ అక్రమ రవాణా చేసి కోట్లు దండుకుంటున్నారని ధ్వజమెత్తారు.గ్రామ గ్రామాన బెల్టుషాపులు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహించారు. కోస్తాలో ఉన్న కోడి పందాల కల్చర్ సీమకు కూడా తీసుకువచ్చారని, సంక్రాంతికి కోడి పందాలతో పాటు జూదం కూడా నిర్వహించారన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, సానుభూతి పరులపై కేసులు పెట్టేందుకు అధికారులు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తున్నారని విమర్శించారు.
వైఎస్సార్ సీపీ బలిష్టంగా ఉంది:
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ బలిష్టంగా ఉందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలను వైఎస్సార్ సీపీ కై వసం చేసుకుంటుందని రవిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీలో ఉన్న నాయకులంతా సమిష్టిగా కృషి చేస్తే 99శాతం స్థానాలు కై వసం చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా, ఎన్ని ప్రలోభాలు పెట్టినా, అవసరం, అవకాశం ఉన్నా కూడా వైఎస్సార్ సీపీ నాయకులు ఇతర పార్టీ వైపు చూడరన్నారు. వైఎస్సార్ జిల్లా జగన్‌మోహన్ రెడ్డి అడ్డా అని, ఈ కంచుకోటను బద్దలు కొట్టేవారు లేరని, రాలేరని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ట్యాంపరింగ్‌తో ఈవీఎంల మోసంతో ఓటమి చవి చూశామన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, గంగాధర్ రెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మహ్మద్ సాదిక్, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, రాజుపాళెం జగన్‌మోహన్ రెడ్డి, గఫార్, ఇర్ఫాన్, సత్యంరెడ్డి, దేవదానం, జిలానీ బాషా, నాగరాజాచారి, గౌస్ మున్నా, శివక్రిష్ణారెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని సైతం వదలడం లేదని, తిరుమల లడ్డూను రాజకీయం కోసం వాడుకుంటున్నారని తెలిపారు. తిరుపతి లడ్డూలో కొవ్వు కలవలేదని సుప్రీం, సిట్ సైతం చెప్పడం కూటమి నేతలకు చెంపపెట్టు అన్నారు. కూట మి ప్రభుత్వానికి ప్రజలు సమాధి కట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.


