ఆర్టీసీ డీఎంల బదిలీలు
– కడపకు ఆర్సీ నిరంజన్ రాక
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీసీ కడపజోన్‌లో పలు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ శుక్రవారం సాయంత్రం ఆర్టీసీ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో కడప డిపో మేనేజర్‌గా పనిచేస్తున్న జనార్దన్‌ను కమర్షియల్ ఏటీఎంగా బదిలీ చేశారు. అలాగే కమర్షియల్ ఏటీఎం కన్యాకుమారిని బద్వేలు డీఎంగా, బద్వేలు డీఎంగా పనిచేస్తున్న ఆర్సీ నిరంజన్‌ను కడప డీఎంగా బదిలీ చేశారు. ఈ మేరకు సత్వరమే ఆయా స్థానాలలో చేరాలని డీఎంలను ఉన్నతాధికారులు సూచించారు.
రేపు అదానీ రాక
లింగాల : ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం పార్నపల్లెకు ఆదివారం రానున్నారు. గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న అదానీ పవర్ ప్లాంటును సందర్శించనున్నారు. అనంతపురం జిల్లా సరిహద్దులో చిత్రావతి డ్యాం పక్కనే భారీ కొండపై మూడేళ్ల క్రితం రూ.2వేల కోట్లతో పవర్ ప్లాంటు నిర్మాణ పనులను చేపట్టారు. సీబీఆర్‌లోని నీటిని రివర్స్ పంపింగ్ ద్వారా విద్యుత్ తయారు చేసే విధంగా ఈ ప్లాంటును రూపొందించారు. అదానీ రాక సందర్భంగా ఆర్డీఓ చిన్నయ్య, డీఎస్పీ మురళీ నాయక్‌లు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీబీఆర్ ఆనకట్టపై ఇదివరకే నిర్మించిన హెలీప్యాడ్‌ను పరిశీలించారు. పార్నపల్లె నుంచి హెలీప్యాడ్ అక్కడ నుంచి పవర్ ప్లాంటు వరకు తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లను సీఐ ఎన్వీ రమణ, ఎస్‌ఐ జగదీశ్వరరెడ్డిలు శుక్రవారం క్షుణ్ణంగా పరిశీలించారు.
ట్యూటర్‌గా పదోన్నతులు
కడప రూరల్ : వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో శుక్రవారం స్టాఫ్ నర్స్ నుంచి ట్యూటర్‌గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో ఏడు మందికి ముగ్గురు పదోన్నతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పదోన్నతుల కౌన్సెలింగ్ చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు.
రాజంపేట : గ్రూప్–2 విజేతగా తిరుపతి జిల్లా పెనగలూరు మండలం కట్టవారిపల్లె అప్పరాజుపేటకు చెందిన కొల్లా శ్రీవాణి నిలిచింది. తండ్రి కొల్లా శ్రీనివాసులు, తల్లి కొల్లా రమాదేవిల కుమార్తె శ్రీవాణి తిరుపతిలోని పోస్టల్ డిపార్టుమెంట్‌లో పనిచేస్తోంది. చక్రంపేట హైస్కూల్‌లో పదవతరగతి వరకు చదువుకుంది. తిరుపతి చైతన్యలో ఇంటర్ విద్యను అభ్యసించింది. డిగ్రీ విద్యను తిరుపతి ఎమర్డాల్‌లో చదువుకుంది. తిరుపతి శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎంసీఏను పూర్తి చేసింది. ఆ తర్వాత పోటీపరీక్షలకు కష్టపడి చదువుకుంది. ఈ నేపథ్యంలో 2019లో పంచాయతీ సెక్రటరీ, 2022 పోస్టల్ అసిస్టెంట్‌గాను, ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా నియమితులైంది.
ఉర్దూ కవి సమ్మేళానికి
ఆహ్వానం
మదనపల్లె సిటీ : తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరులో జరిగే అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళానికి మదనపల్లె ఉర్దూ కవులు బాబా ఫక్రుద్దీన్ అలియాస్ ఖమర్ అమీని, పఠాన్ మహమ్మద్‌ఖాన్‌లకు ఆహ్వానం అందింది. ఈ మేరకు శుక్రవారం వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఉర్దూ కవి సమ్మేళానికి ఆహ్వానం అందడం సంతోషకరమన్నారు. కవి సమ్మేళనంలో మహాప్రవక్త హజరత్ మహమ్మద్ జీవితానికి సంబంధించి నాత్–ఏ–షరీఫ్ చదవనున్నట్లు తెలిపారు.
ఆర్టీసీ డీఎంల బదిలీలు
ఆర్టీసీ డీఎంల బదిలీలు
ఆర్టీసీ డీఎంల బదిలీలు


