రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజం
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు జరగడం లేదని, లోకేష్ రచించిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. 77వ గణతంత్రదినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషాలతో కలిసి ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి, గౌరవ వందనం చేశారు. అనంతరం రవీంద్రనాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా త్యజించి దేశానికి స్వాతంత్య్రం తెచ్చారన్నారు. బ్రిటీషు పాలనను తలపించేలా కూటమి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పి సనాతన ధర్మాన్ని నిర్వీర్యం చేశారన్నారు. దేవుడే వీరికి తగిన బుద్ధి చెబుతాడని హెచ్చరించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాట్లాడుతూ భారత రాజ్యాంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయన్నారు. లక్ష్యాలు నిర్దేశించుకొని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ అక్రమాలు ఎన్నో రోజులు కొనసాగవని హెచ్చరించారు. మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్‌ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


