శాంతి సందేశాలతో కొనసాగిన ఇస్తేమా
కడప సెవెన్‌రోడ్స్: కడప నగర శివార్లలోని కొప్పర్తి వద్ద నిర్వహిస్తున్న ఇస్తేమా శనివారం రెండోరోజు కొనసాగింది. ఉదయం ఫజర్ నమాజ్ తర్వాత మత గురువులు, ఆధ్యాత్మిక వేత్తలు తమ సందేశాలను అందజేశారు. రెండోరోజు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు ఇస్తేమా ప్రాంగణానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా వక్తలు దైవ మార్గాన్ని అనుసరించాల్సిన అంశంతోపాటు పవిత్ర ఖురాన్‌లోని వివిధ అంశాలను తెలియజేశారు. ముస్లిం సమాజం ఆదర్శవంతమైన జీవితాన్ని అవలంభించాలని సూచించారు. లక్షలాది మందికి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అన్ని చర్యలు చేపట్టారు. రాకపోకలకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను నడిపారు. కడప నగరంనుంచి కూడా పెద్ద ఎత్తున నగర ప్రముఖులు, ముస్లింలు ఇస్తేమాకు తరలివచ్చి గురువుల ఆధ్యాత్మిక సందేశాలను ఆలకించారు. భక్తులకు సేవలు అందించేందుకు నియమించబడిన వలంటీర్లు తమ సేవలు అందించారు. మూడు రోజులపాటు కొనసాగే ఈ ఇస్తేమా ఆదివారంతో ముగిసిన తర్వాత భక్తులకు తమతమ గమ్యస్థానాలకు తరలి వెళ్లనున్నారు.


