రబీ సాగు సగమే..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుఫాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అను కున్నంత ముందుకు సాగలేదు. రబీసాగు ఆరంభమై రెండున్నర నెలలు దాటినా అతికష్టంపైన సాధారణసాగులో సగం అంటే 50 శాతం కాగా అంతకు మంచి 5 శాతం మాత్రమే ఎక్కువ సాగైయింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 1,39, 796 హెక్టార్లకుగాను జిల్లాలో 1,00,680 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా ఈ ఏడాది అదే సమయానికి 77,121 హెక్టార్లు మాత్రమే సాగయింది.
● ఇక ఆరుతడి పంటలసాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం వేరుశనగ, నువ్వు పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నా భూముల్లో నెమ్ము ఆరక పంటలసాగు ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాసక్తి నెలకొంది. ముందుగా సాగుచేసిన పంటలు మాత్రం వర్షాలకు దెబ్బతిన్నాయి.
ముగిసిన శనగ సాగు సీజన్ ...
జిల్లాలో శనగ సాగు సీజన్ ముగిసింది. ఈ ఏడాది శనగపంట సాగు ఆశించిన మేర కాలేదు. జిల్లాలో శనగ సాధారణసాగు 76,613 హెక్టార్లకుగాను 58,160 హెక్టార్లలో మాత్రమే సాగయింది. సాధారణంగా ఈ ఏడాది వందశాతానికి మించి శనగసాగు అవుతుందనుకున్న అధికారుల ఆశలు నిరాస అయింది.
● జిల్లాలో జమ్మలమడుగు, తొండూరు, లింగాల, ఎర్రగుంట్ల, ముద్దనూరు, బిమఠం, వల్లూరు, సింహాద్రిపురం, పెండ్లిమర్రి, రాజుపాలెం, వీఎన్‌పల్లి, పెద్దముడియం, కొండాపురం, మైలవరం మండలాల్లో అత్యధికంగా శనగపంట సాగు అవుతుంది. అలాంటిది ఈ ఏడాది అయా మండలాల్లో అనుకున్న మేర సాగు కాలేదని రైతులు తెలిపారు. కాగా.. జిల్లాలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో సాధారణ సాగుకు మించి శనగపంట సాగయింది. మిగతా మండలాల్లో సగం కూడా సాగు కాలేదు.
జిల్లావ్యాప్తంగా 55 శాతం మేరపంటల సాగు
వరుస తుపాన్లు ఇందుకు కారణం
1,39,796 హెక్టార్లకుగాను 77,121 హెక్టార్లలో వివిధ పంటల సాగు
వేరుశనగ, పత్తి, సన్‌ప్లవర్ సాగు అంతంతే..
శనగ, మినుము, పెసర సాగుకుముగిసిన సీజన్
ప్రస్తుతం జిల్లాలో వరి, వేరుశనగ, నువ్వుల పంటలకు మాత్రమే అదును ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే ఈ రబీ సీజన్‌కుగాను వరి సాధారణసాగు 11,645 హెక్టార్లకుగాను ప్రస్తుతం 734 హెక్టార్లలో సాగు అయ్యింది. ముందుగా సాగు చేసిన రైతులు మళ్లీ రెండవ పంట సాగుగా వరిపంటను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. అలాగే వేరుశనగ సాధారణసాగు 5079 హెక్టార్లుకాగా ప్రస్తుతం 926 హెక్టార్లలో సాగయింది. అలాగే నువ్వు పంటకు సంబంధించి సాధారణసాగు 4566 హెక్టార్లుకాగా ప్రస్తుతం 1190 హెక్టార్లలో సాగయింది. అయితే ఈ మూడు పంటలసాగుకు అదను ఉంది కాబట్టి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఈ ఏడాది రబీ ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి.
రబీ సాగు సగమే..
రబీ సాగు సగమే..


