ఉద్యాన సాగులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు
కడప సెవెన్‌రోడ్స్: వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో వైయస్సార్ కడప జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం లో నిలిచేలా సాగుబడి విస్తీర్ణం పెరుగుతోందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం లో భాగంగా మొదటి రోజు బుధవారం జరిగిన సమావేశంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అభివృద్ధిపై ముఖ్య మంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లా లోని రైతులు ఉద్యాన, వాణిజ్య పంటల పైన ఎక్కువ మొగ్గు చూపుతూ.. ఉత్పత్తి కూడా గణనీయంగా పెంచుతున్నారన్నారు. వాణిజ్య పంటలైన అరటి, చీనీ, నిమ్మ, దానిమ్మ, పండ్ల తోటలతో పాటు ఉల్లి, పసుపు, పూల తోటలను విస్తారం గా సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో పండించిన చామంతి పువ్వులను అధికంగా బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల ఆశించిన మేర ఆదాయాన్ని జిల్లా రైతులు పొందుతున్నారన్నారు. వాణిజ్య పంటల విషయం లో ఇక్కడ రైతులు మార్కెటింగ్ పైన కొంత ప్రత్యేక దష్టి సారించాల్సి ఉందని, ఏ సీజన్ లో.. ఏయే పంటలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ట్రేడింగ్ పైన రైతులకు అవగాహన పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తు లో వైయస్సార్ కడప జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచేలా, ఉద్యాన హబ్ గా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


