బాబు బినామీల జేబులు నింపడానికే ప్రైవేటీకరణ
కడప కార్పొరేషన్: చంద్రబాబు బినామీల జేబులు నింపడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం కడపలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999–24 కాలంలో రాష్ట్రానికి 19 కాలేజీలు మంజూరు కాగా అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక్కటి మాత్రమే వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ అంటే చంద్రబాబుకు ఎంత మక్కువో ఈ ఉదాహరణ చాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేద విద్యార్థులు రూ.70వేలతో మెడిసిన్ పూర్తి చేయవచ్చని, లేనిపక్షంలో ఏడాదికి రూ.1.14లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు బిల్లులు చెల్లించపోవడంతో అవి పేదలకు వైద్యం చేయడం మానేశాయన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించిందని, ఆ సంతకాల పత్రాలను ఈనెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌కు అందించనున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు.
ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఖజానాకు
వచ్చే ఆదాయం ఎంతో చెప్పాలి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో బహిర్గతం చేయాలని వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ మాయాజాలం చెబితే చాంతాడంత అవుతుందని, వినడానికి వీధినాటకం అవుతుందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ఆయన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ ఏడాదికి రూ.8వేల సంపదను ఖజానాకు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని 2022లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినప్పటికీ, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ విధానంతో పేదలకు మేలు జరగదని భావించారన్నారు. అందుకే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు, వారి ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. ఈ సమావేశంలో వైద్య విభాగం నగర అధ్యక్షుడు సతీష్‌రెడ్డి, డాక్టర్ పవన్ కుమార్‌రెడ్డి, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు.


