గోడౌన్‌లో అగ్నిప్రమాదం
– రూ.9 లక్షల మేర నష్టం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని పాత సామాన్ల గోడౌన్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షేక్షావలీ కొన్నేళ్లుగా పాత సామాన్ల (గుజరీ) షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు పరిసర ప్రాంత వ్యాపారులు ప్లాస్టిక్, పాత ఇనుప వస్తువులను సేకరించి ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని అతను మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని గోడౌన్‌లో నిల్వ చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్‌లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గోడౌన్‌లో ప్లాస్టిక్ సామాన్లు అధికంగా ఉండి మంటల్లో కాలడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల్లోకి పొగ వెళ్లడంతో వారు భయాందోళన చెందారు. జేసీబీ సాయంతో గోడౌన్ గోడను పగులకొట్టి మంటలను ఆర్పారు. ప్రొద్దుటూరుతో పాటు మైదుకూరు, జమ్మలమడుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 9 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.


