ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ కనీసం 12వ పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. జూలై 2024 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవుల బిల్లులను ట్రెజరీలకు సమర్పించి మూడేళ్లయినా ఇంత వరకు డబ్బు చెల్లించలేదన్నారు. 11వ ీపీఆర్సీ బకాయిలు, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, జిల్లా కౌన్సిలర్లు సుబ్బయ్య, ప్రభాకర్‌రెడ్డి, దామోదర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


