అటల్ ఆశయం మోదీతో సాధ్యం
కడప (కోటిరెడ్డి సర్కిల్) : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు భారతదేశ దశను మార్చిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అటల్–మోదీ సుపరిపాలన యాత్ర కడప నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎర్రముక్కపల్లి కూడలిలో శనివారం కూటమి నేతలు కలిసి వాజ్‌పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. దేశంలో సుపరిపాలనకు వాజ్‌పేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన విధానాలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయని గుర్తు చేశారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్‌పేయి స్వశక్తితో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన బాటలోనే ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని 2047 నాటికి నంబర్ 1గా చేసేందుకు పని చేస్తున్నారన్నారు. అంతకుముందు వినాయక నగర్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగలి శశిభూషణ్‌రెడ్డి, బాలకృష్ణ యాదవ్, నాగోతు రమేష్ నాయుడు, ఆదూరి శాదరమ్మ, వేణువర్ధన్ రెడ్డి, దయాకర్‌రెడ్డి, ప్రవీణ్ నాయుడు, చలపతి, బొమ్మన విజయ్, భాను ప్రకాష్, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సుంకర శ్రీనివాస్, శ్రీనివాసులరెడ్డి, హరిప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు.


