మదనపల్లెలో మిస్సింగ్.. మంగాపురంలో మర్డర్.?
● హత్యచేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు
● దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు
● భర్త ఆచూకీ కోసం స్టేషన్ వద్ద భార్య పడిగాపులు
మదనపల్లె రూరల్ : మదనపల్లెలో అదృశ్యమైన వ్యక్తి తిరుపతి సమీపంలోని మంగాపురం వద్ద హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తిని స్నేహితులు చంపి తోటలో పూడ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన భర్త కోసం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి భార్య పడిగాపులు కాస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీ రామాపురానికి చెందిన చంద్రప్ప కుమారుడు ఆవులపల్లె నరసింహులు(35) నవంబర్ 27న ఇంటి నుంచి తన ద్విచక్రవాహనంలో వెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం భార్య విజయలక్ష్మి అతడికి ఫోన్ చేస్తే...సీటీఎం పంచాయతీ దిన్నెమీదపల్లెకు చెందిన స్నేహితుడు నాగరాజుతో కలిసి తిరుపతికి వెళ్లినట్లు చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె సాయంత్రం మరోసారి భర్తకు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి భర్త ఆచూకీ కోసం బంధువులతో కలిసి మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 3న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భర్త నరసింహులు వ్యవసాయం చేస్తుంటాడని, అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళితే మూడు నుంచి పదిరోజుల వరకు బయటి ప్రాంతాల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 27న వెళ్లిన భర్త ఇప్పటివరకు తిరిగి రాలేదని, ఆచూకీ తెలపాల్సిందిగా పోలీసులను కోరింది. అదేరోజు తాలూకా పోలీసులు వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నరసింహులు స్నేహితుడైన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య మనస్పర్థల కారణంగా నరసింహులును హత్యచేసి తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం బ్రిడ్జి వద్ద ఓ తోటలో పూడ్చిపెట్టినట్లుగా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, హత్య ఎప్పుడు జరిగిందనేది స్పష్టత లేకపోవడంతో నిందితులతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీస్తేనే మృతికి గల కారణాలను చెప్పగలమని సీఐ కళావెంకటరమణ అన్నారు. కాగా, నరసింహులు వ్యవసాయంతో పాటు బ్లాక్ మ్యాజిక్, గుప్తనిధుల వేట తదితర పనులకు స్నేహితులతో కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్పారు. ఈ వ్యవహారంలో స్నేహితుల మధ్య వాటాల పంపకం లేదా ఇతర కారణాలు హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. గురువారం తాలూకా పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం వెలికితీసి నిర్ధారించనున్నారు.
మదనపల్లెలో మిస్సింగ్.. మంగాపురంలో మర్డర్.?


