మోసం చంద్రబాబు నైజం
పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమే మోసం చేయటమని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ఆయనకు మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎల్లో మీడియా వంతపాడుతోందన్నారు. చంద్రబాబు జీవితమంతా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసగించడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నట్లుగా తప్పుడు అంకెల గారడీతో రాష్ట్రాన్ని మభ్యపెడుతున్నారన్నారు. ఇండిగో సంక్షోభంపై టీడీపీ కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరుపై జాతీయ మీడియాతోపాటు దేశంలోని అన్ని మీడియాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాలు దారుణంగా వెనుకబడిపోయాయన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు. పేద ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అప్పులను మాత్రం బాగా సృష్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలల కాలంలోనే రూ.2.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు..
రాష్ట్రంలో జగనన్న హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్‌పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో పాలు పంచుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మేధావులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు, ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ చేస్తున్న ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రజల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి


