తుపాను ప్రభావిత రైతాంగాన్ని ఆదుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : వరుస తుపానుల కారణంగా కుదేలైన రైతాంగాన్ని ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ, ధాన్యం రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్‌చార్జిలు, కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నరన్నారు. దీంతో 75 కేజీల బస్తాను రూ.1200కు అమ్ముకొని బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతోపాటు ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. అరటి రైతులకు న్యాయం చేస్తామని, ఉల్లి పంట రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని, భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆందోళన అనంతరం ఆర్డీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి శంకర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, ఎన్ విజయలక్ష్మి, జి.వేణుగోపాల్, బి శంకర్ నాయక్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, కౌలు రైతు సంఘం నాయకులు సుదర్శన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు సావంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర


