వనిపెంట ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
మైదుకూరు : వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. జాతీయ హస్తకళా వారోత్సవాల్లో భాగంగా వనిపెంటలోని ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో హస్త కళాకారులు తయారు చేసిన ఇత్తడి, రాగి కళాకృతులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హస్త కళాకారులను కాపాడుకోవాలని, వారికి అండగా నిలవాలని తెలిపారు. కళాకారులు తయారు చేసే కళాకృతుల విలువను పెంచాలన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 36 హస్తకళల ఉత్పత్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, రెండు నెలల శిక్షణలో కళాకారులు మంచి నైపుణ్యాన్ని పొందాలని సూచించారు. తర్వాత ఇక్కడి కళాకారులు తయారు చేసే కళాకృతులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాయితీతో ముడి సరుకును అందించేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల కార్పొరేషన్ ఓఎస్‌డీ లక్ష్మీనాథ్, అధికారులు హుస్సేన్, శివారెడ్డి, ఢిల్లేశ్వరరావు, శ్రీకాంత్, వనిపెంట ఇత్తడి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్
డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్


