మున్సిపల్ పెట్రోలు బంకు డబ్బుపై విచారణ జరిపించండి
ప్రొద్దుటూరు : మున్సిపల్ పెట్రోలు బంకులో రూ.కోటి 30లక్షలు మాయమైందని టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ క్యాసినో నిర్వాహకులతో కలిసి చేసిన విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ ఛాంబర్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విచారణ చేయించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఈ డబ్బు వసూలుకు సంబంధించి తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగి ప్రవీణ్ పెట్రోలు బంకును నిర్వహిస్తున్నాడని, అనేక మంది ట్రాన్స్‌పోర్టర్లకు డీజిల్ అప్పు ఇచ్చాడన్నారు. ఈ ప్రకారం సుమారు రూ.80లక్షలు బకాయిలు ఉందని సమాచారం తెలిసిందన్నారు. ఇందులో తన ప్రమేయం ఉందని నిరూపించినా, తాను డీజిల్ అప్పు ఇవ్వాలని చెప్పి ఉన్నా బాధ్యత తనదేనన్నారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉందో మీ సోదరుడు రమణతో చెప్పించాలని చల్లా రాజగోపాల్‌ను కోరారు. సిరిపురి కాంప్లెక్స్‌కు సంబంధించిన షిరిడీ సాయి స్వీట్స్ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి కోడలి పేరుతో ఉందని, ప్రతినెలా ఆయన రూ.లక్షా 8వేలు, వెనక ఉన్న ఐస్‌క్రీం పార్లర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి అల్లుడు నిర్వహిస్తున్నారని, ఇందుకు గాను రూ.85వేలు అద్దె చెల్లిస్తున్నారన్నారు. రాయలసీమలోనే మున్సిపల్ భవనాలకు సంబంధించి అత్యధికంగా ఇక్కడే బాడుగ చెల్లిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు ఉస్మాన్, మేకల ప్రకాష్, శివప్రసాద్ యాదవ్, గుర్రం ప్రకాష్ పాల్గొన్నారు.


