జగన్మాతా.. నమోస్తుతే!
బ్రహ్మంగారిమఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. శక్తిస్వరూపిణి, సర్వమంగళకారిణిగా ప్రసిద్ధి చెందారు. ఈశ్వరీదేవిమఠంలో ఈ నెల 11 నుంచి అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామిమఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి పార్వతిదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు శ్రీ ఈశ్వరీదేవి. బ్రహ్మంగారి రెండో కుమారుడైన గోవిందస్వామి, గిరియమ్మ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం, తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు.
14 ఏళ్లు తపస్సు చేసి..
బ్రహ్మంగారిమఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న సాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేసేందుకు సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. స్వీయ కల్యాణాన్ని త్యజించి లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు.
మఠాధీశులై..
తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్య పూజ కార్యక్రమాలు, ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తుండే వారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. వారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన లంకెనపల్లి సుబ్బయ్యాచారి, స్థానికుడు చాటకొండ చంగయ్య శ్రేష్టి ప్రధాన శిష్యులు. ఈశ్వరిదేవి రాజయోగినిగా మారి.. శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. ఆమె అనేక మహిమలు చూపారని భక్తులు పలు ఉదాహరణలు పేర్కొంటారు.
సజీవ సమాధి..
1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. ఆ ప్రాంతం శ్రీ ఈశ్వరీదేవిమఠంగా పేరొందింది.
ఆరాధనోత్సవాలు..
ఈ నెల 11 నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. 13న మార్గశిర బహుళ నవమిన సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కనుక ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు.
వైభవోపేతంగా ఉత్సవాలు..
అమ్మవారి ఆశీస్సులతో ఏటా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శిష్యులు, భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి బి.వి.జగన్‌మోహన్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను.
– శ్రీ వీరశివకుమారస్వామి,
మఠాధిపతి, ఈశ్వరీదేవిమఠం
భక్తుల కొంగు బంగారంగా ఈశ్వరీదేవి అమ్మవారు
రేపటి నుంచి ఆరాధన గురుపూజ మహోత్సవాలు
తరలిరానున్న ఐదు రాష్ట్రాల భక్తులు
జగన్మాతా.. నమోస్తుతే!
జగన్మాతా.. నమోస్తుతే!


