సిద్ధారెడ్డిపల్లెలో దొంగతనం
చాపాడు : మండల పరిధిలోని సిద్ధారెడ్డిపల్లె గ్రామంలో మంగళవారం సాయంత్రం దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గౌరీ సుబ్బిరెడ్డి అనే వ్యక్తి ఇంటిలో రెండు తులాల బంగారు, రూ.50వేలు నగదు గుర్తు తెలియని దొంగలు అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గౌరీ సుబ్బిరెడ్డి భార్య కూలి పనికి, కుమారుడు బేల్దారి పనికి వెళ్లడంతో ఇంటి వద్దనే ఉన్న సుబ్బిరెడ్డి తోటి వ్యక్తులతో కలిసి గ్రామ సమీపంలోకి వెళ్లాడు. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో దొంగ ఇంటిలోకి వెళ్లి బీరువా పగలగొట్టి రెండు తులాల బంగారు. రూ.50వేలు నగదు ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు తెలిపాడు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు ఇద్దరు వ్యక్తులను విచారిస్తున్నట్టు ఏఎస్‌ఐ తెలిపారు.
జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ట్రాఫిక్ కానిస్టేబుల్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎస్‌పీ మహబూబ్ బాషా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు ఎంపికయ్యాడు. నవంబర్ 15, 16వ తేదీల్లో కాకినాడలో జరిగిన 14వ రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొని బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. మహబూబ్ బాషాను మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ అభినందించారు.
రాష్ట్రస్థాయి హాకీ పోటీలు ప్రారంభం
పులివెందుల రూరల్ : స్థానిక వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో మంగళవారం 69వ స్కూలు ఎస్‌జీఎఫ్ రాష్ట్రస్థాయి అండర్–17 బాలుర హాకీ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్కూల్ గేమ్స్ సెక్రటరీ భానుమూర్తి, టోర్నమెంట్ అబ్జర్వర్ రాకేష్ బాబు, ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి, డీఎస్‌డీఓ బాషా మొహిద్దీన్, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయ కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ కిరణ్ తదితరులు రాష్ట్రస్థాయి హాకీ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి విక్టర్, హాకీ అసోసియేషన్ కార్యదర్శి శేఖర్, రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయుడు కొండారెడ్డి, రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ విజయ ప్రసాద్‌రెడ్డి, సాయిబాబా పాఠశాల కరస్పాండెంట్ ఓబుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
సిద్ధారెడ్డిపల్లెలో దొంగతనం


