మోదీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి
ప్రొద్దుటూరు : ప్రస్తుతం భారత దేశంలో దేశీయ విమానాల పరిస్థితిని చూసి మోదీ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇంతటి ఘోర తప్పిదానికి కారణమైన విమానయాన శాఖమంత్రి కింజారపు రామ్మోహన్‌నాయుడు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సంఘటనతో దేశానికి సంబంఽధించి మర్యాద, పరువు ప్రపంచ వ్యాప్తంగా పోయాయన్నారు. కేవలం ఇండిగో సంస్థకు 60 నుంచి 70 శాతం విమానాలను అప్పగించడం, మిగతా 30 నుంచి 40 శాతం మాత్రమే ఇతర సంస్థలకు అప్పగించడం వల్ల ఈ సంఘటన జరిగిందన్నారు. ప్రభుత్వమే విమానాలను నడిపితే ఏ సమస్య లేదని, ప్రభుత్వం నడపకుండా ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం, అది కూడా ఒకే సంస్థకు ఎక్కువ శాతం అప్పగించడం వల్ల ఈ పరిస్థితి దాపురించిందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్‌పరం చేస్తే భవిష్యత్తులో పరిస్థితి ఇండిగో సంస్థలాగే ఉంటుందని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంఽధించి ఇప్పటి వరకు లక్షా 400 సంతకాలను పూర్తి చేశామని, బుధవారం ఈ పుస్తకాలను ర్యాలీగా వెళ్లి జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేస్తామన్నారు. సమావేశంలో మాజీ సర్పంచ్ కె.దేవీప్రసాదరెడ్డి, మాజీ కౌన్సిలర్ పిట్టా భద్రమ్మ, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు మార్తల ఓబుళరెడ్డి, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, మాజీ వార్డు మెంబర్ గోకుల మేరి పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి


