మోటార్ సైకిళ్ల చోరీ కేసులో ఇద్దరి అరెస్టు
కడప అర్బన్ : కడప నగరంలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరిని ఒన్‌టౌన్ పోలీసులు మోచంపేట సర్కిల్ వద్ద అరెస్టు చేశారు. మరొక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, అదనపు ఎస్పీ ప్రకాష్ బాబుతో కలిసి మంగళవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. అరెస్టయిన ఇద్దరు నిందితులలో కడప నగరం రవీంద్ర నగర్‌కు చెందిన సయ్యద్ గౌస్ బాషా, అదే ప్రాంతంలోని లా కాలేజ్ వెనుక ఉన్న షేక్ మహబూబ్ బాషా, మరో మైనర్ బాలుడితో కలిసి చోరీచేసిన ద్విచక్ర వాహనాలను తీసుకెళ్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప ఒన్‌టౌన్ సీఐ చిన్న పెద్దయ్యతో పాటు, ఎస్‌ఐలు అమరనాథ్ రెడ్డి. ప్రదీప్ కుమార్ సిబ్బందితో నిఘా ఉంచి అరెస్టు చేసినట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు వేల్పుల నరేంద్ర అలియాస్ మహేంద్ర పరారీలో ఉన్నాడని అతని కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. వీరంతా ఒక బ్యాచ్ గా తయారై వన్ టౌన్, తాలూకా, రిమ్స్, సీకేదిన్నె ప్రాంతాలలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ చేసి వాటిని విక్రయించేందుకు తీసుకెళుతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. వారిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి పది లక్షల రూపాయలు విలువ చేసి 18 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రూ. 10 లక్షల విలువైన 18 మోటార్
సైకిళ్లు స్వాధీనం


