మురి‘పాల’కోసం తల్లడిల్లిన దూడ
వేంపల్లె : మూగ జీవమైన దూడకు తన తల్లి మృతి చెందిందని తెలియక రోడ్డుపై పడి ఉన్న తల్లి పాలు తాగేందు కోసం వెంపర్లాడింది.ఈ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ చలించి పోయారు. పల్లెలో చింతలమడుగుపల్లె సహకార సొసైటీ కార్యాలయం ఎదుట మంగళవారం ఒక ఆవు బిడ్డకు జన్మనిచ్చింది. పశు వైద్య శాఖ వైద్యులు ప్రసవించిన ఆవుకు చిక్సిత చేసి వెళ్లారు. అయితే ఆవు కడుపులో ఎక్కువగా ప్లాస్టిక్ కవర్లు ఉండటం వలన ఆవు మృతి చెంది రోడ్డుపైనే పడిపోయింది. లేగదూడ మాత్రం తన తల్లి పాల కోసం వెంపర్లాడుతూ.. తల్లి పక్కనే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కూర్చుంది. ప్లాస్టిక్ కవర్లు ఎక్కువగా డ్రైనేజీ కాలువల్లో, రోడ్లపై వేస్తుండడంతో అందులోని ఆహారాన్ని తినేందుకు ప్రయత్నించి ఆవులు ప్లాస్టిక్ కవర్లను మింగేస్తున్నాయి. ఫలితంగా మృత్యువాత పడుతున్నాయని పలువురు వాపోతున్నారు. పంచాయతీ అధికారులతోపాటు మండల స్థాయి అధికారులు స్పందించి రోడ్లపై ఆవులను విడిచి పెడుతున్న యాజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


