ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్
ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలో స్థానిక శివాలయం వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సును జిప్సంలోడుతో ప్రయాణిస్తున్న టిప్పర్ ఢీకొంది. స్థానికుల సమాచారం మేరకు ముద్దనూరు నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు జమ్మలమడుగుకు బయలుదేరింది. శివాలయం వద్దకు రాగానే ఘాట్‌రోడ్డునుంచి ఎదురుగా వస్తున్న టిప్పర్ బస్సు ముందు భాగంలో ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగంలోని అద్దం ధ్వంసమైంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. టిప్పర్ బ్రేక్ ఫెయిలవడంతోనే బస్సును ఢీకొన్నట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సును ఢీకొని అదుపుతప్పి టిప్పర్ రహదారి పక్కలో బోల్తా పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలో ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసులు ’విజిబుల్ పోలీసింగ్’ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలకు మరింత చేరువవుతూ, నేరాలను నియంత్రించడం, రహదారి భద్రతపై అవగాహన కల్పించడం వంటి చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా నిషేధిత వస్తువులు, గంజాయి వంటి వాటి అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు డ్రైవర్లు సీటు బెల్టు పెట్టుకోవాలని స్పష్టం చేస్తున్నారు.
విశ్వవ్యాప్తమైన వేమన కీర్తి
కడప ఎడ్యుకేషన్ : ఆనాటి ప్రజల్లో సమతను, మమతను పెంచాలని విశ్వసందేశ విహారియై తనదైన శైలిలో బోధ చేసిన వేమన విశ్వవ్యాప్తమైన కీర్తిని సంపాదించుకున్నారని రెడ్డి సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి అన్నారు. జనవరిలో నిర్వహించబోయే వేమన జయంతి సందర్భంగా కడప రెడ్డి సేవా సమితి వారు ఆదివారం సేవాసమితి ప్రాంగణంలో ఐదవ తరగతి నుంచి పదవ తరగతి విద్యార్థులకు వేమన పద్య పఠన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కల కొండారెడ్డి మాట్లాడుతూ సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేందుకు వేమన పద్యాలను సరళంగా చెప్పారన్నారు. వైయస్సార్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండే ఉపమానాలే వేమన పద్యాల్లో ఉపయోగించారన్నారు. సమితి అధ్యక్షుడు కుప్పిరెడ్డి నాగిరెడ్డి, కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలల నుంచి 150 మందికి పైగా విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొనగా వీరిలో 32మందిని ఎంపిక చేశారు. తరువాత ఈనెల 21వ తేదీన జరిగే పోటీల్లో వీరిలో ముగ్గురిని మాత్రమే విజేతలుగా ప్రకటించి ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి వరుసగా 10 వేలు, 8 వేలు, 6 వేల రూపాయలను అందజేస్తామన్నారు. ్యాయ నిర్ణయతలుగా డాక్టర్ పొదిలి నాగరాజు, డాక్టర్ జి.వి.సాయి ప్రసాద్, డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి, గంగనపల్లి వెంకటరమణ, వై.దామోదరమ్మ, బి.శ్రీదేవి వ్యవహరించారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్


