6 నుంచి జిల్లాలో గైడ్స్ కెప్టెన్‌లకు క్యాంపు నిర్వహణ
కడప ఎడ్యుకేషన్: కడప శంకరాపురంలోని జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్ ప్రాంతీయ కార్యాలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు బేసిక్ గైడ్ కెప్టెన్‌లకు ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ చీఫ్ కమిషనర్ సెక్రటరీ, విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. అదే విధంగా బేసిక్ శిక్షణ పూర్తయి 6 నెలల పూర్తయిన అడ్వాన్స్ డే గైడ్ కెప్టెన్‌లకు ప్రత్యేక శిక్షణ క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరితోపాటు 21 సంవత్సరాలు నిండి డిగ్రీ పూర్తయిన మహిళా అభ్యర్థులు రెంజర్ లీడర్ గైడ్ క్యాంపునకు అర్హులన్నారు. జిల్లాలోని పీఎంశ్రీ పాఠశాలలతోపాటు అన్ని యాజమాన్యాల పరిధిలోని గైడ్స్ కెప్టెన్‌లు ఈ క్యాంపునకు హాజరు కావాలని సూచించారు.
మైదుకూరు: మైదుకూరు మండలం మిట్టమానుపల్లెకు చెందిన రైతు ఉమ్మడి మహదేవరెడ్డికి అభ్యుదయ రైతు పురస్కారం లభించినట్టు వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, శాస్త్రవేత్త డాక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. తెలంగాణలోని నందిగామ వద్ద కాన్హా శాంతివనంలో గురువారం సుస్థిర వ్యవసాయాభివృద్ధికి కృషి చేస్తున్న ఆసియన్ పీజీపీఆర్ సంస్థ ఇండియా చాప్టర్ ఆధ్వర్యంలో మహా కిసాన్ మేళా జరిగిందని ఆయన వివరించారు. ఈ మేళాలో దేశ వ్యాప్తంగా పాల్గొన్న వారిలో 65 మందిని ఎంపిక చేసి అభ్యుదయ రైతు పురస్కారాన్ని అందజేసినట్టు తెలిపారు. మిట్టమానుపల్లె వద్ద రైతు మహదేవరెడ్డి ఉద్యాన పంటలు సాగు చేస్తూ పుట్టగొడుగులు, తేనెటీగలు, పెరటి కోళ్లు, జీవాల పెంపకంతో పాటు మామిడి, జామ, నేరేడు, సీతాఫలం వంటి పండ్ల తోటలను పెంచుతున్నారని వివరించారు.


