దీనీ ఇస్తేమా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి
కడప సెవెన్‌రోడ్స్/ కడప కోటిరెడ్డి సర్కిల్: జనవరి 23, 24, 25 తేదీల్లో జిల్లాలో జరగనున్న రాష్ట్ర స్థాయి దీనీ ఇస్తేమా కార్యక్రమం సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పక్కాగా చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులు, ఇస్తేమా కమిటీ సభ్యులకు సూచించారు. శుక్రవారం కలెక్టర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి కొప్పర్తి పారిశ్రామిక వాడ సమీపంలో 350 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించనున్న ఇస్తేమా కార్యక్రమ నిర్వహణా ఏర్పాట్లను పరిశీలించారు. ఇస్తేమా కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్న ఇస్తేమా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తోందన్నారు. కమిటీ సభ్యులు, అధికారులు విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు. కార్యక్రమానికి సంబంధించి రోడ్ మ్యాపు, తాగునీరు, విద్యుత్, మెడికల్, ట్రాఫిక్, బందోబస్తు, ఫైర్ సేఫ్టీ, బ్యారికెట్స్ తదితర మౌలిక అంశాలపై జిల్లా కలెక్టర్ కమిటీ సభ్యులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ, దేశవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ పెద్దలు హాజరు కానున్నారని, కార్యవర్గ కమిటీలు సమన్వయ సహకారాలతో ముందుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో కడప ఆర్డీవో జాన్ ఐర్విన్, ఏపీ ఐఐసి జెడ్‌ఎం శ్రీనివాస మూర్తి, డీపీఓ రాజ్యలక్ష్మి, ఏపీఎస్పీడీసీఎల్ ఎన్‌ఈ రమణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ ఏడుకొండలు, ఆర్ అండ్ బి ఎస్‌ఈ భాస్కర్ రెడ్డి, అధికారులు, కమిటీ కార్యవర్గ సభ్యులు నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


