ఉన్నత స్థాయికి ఎదగాలి
మైదుకూరు: ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున సౌకర్యాలను వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆయన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్‌తో కలిసి పాల్గొన్నారు. వారికి ప్రిన్సిపాల్ వి.నిర్మల, ఉపాధ్యాయులు, విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో నిర్మించనున్న కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ శిలాఫలకాన్ని కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే పుట్టా ఆవిష్కరించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్, సోలార్ సిస్టంతో నిర్మించిన నీటి పథకాన్ని, ఇంటర్మీడియట్ నిర్వహణకు నిర్మించిన నూతన భవన సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని... గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి చదువుకున్నా ఉన్నత స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తూ విద్యాసంస్థలను నిర్వహిస్తుంటే కొన్ని అసాంఘిక శక్తులు వీటిని వాళ్ల చెప్పు చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాయని కలెక్టర్ అన్నారు. ఇక్కడ ఉన్న మంచి వాతావరణాన్ని చెడగొట్టాలని చూస్తున్నాయని.. ఇటీవల వనిపెంట గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటనలపై తాను, ఎస్పీ ప్రిన్సిపాల్‌కు భరోసా ఇచ్చినట్టు గుర్తు చేశారు. పాఠశాలలో పిల్లలతోపాటు టీచర్లు కూడా క్రమశిక్షణతో ఉండాలని, తప్పితే అలాంటి వారిపై చర్యలకు వెనుకాడవద్దని చెప్పామన్నారు. ఈ పాఠశాలలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ కోర్సును ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలల్లో కేవలం ర్యాంకులు మాత్రమే చూస్తారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యతోపాటు క్రమశిక్షణ, వృత్తి నైపుణ్యాన్ని కూడా పెంచేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో డీఈఓ షంషుద్దీన్, బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, సోషల్ వెల్ఫేర్ అధికారి సరస్వతి, నియోజకవర్గ ప్రత్యేక అధికారి డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఎంపీపీ థామస్, తహసీల్దార్ రాజసింహ నరేంద్ర, ఎంపీడీఓ శ్రీధర్ నాయుడు, ఎంఈఓ పద్మలత తదితరులు పాల్గొన్నారు.
పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో
కలెక్టర్ చెరుకూరి శ్రీధర్


