డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసం
పోలీసు శాఖలో ‘డిజిటల్ అరెస్ట్’ లేదు
● సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కుతున్న బాధితులు
● డబ్బు పోగొట్టుకుంటున్న వైనం
● రెండు కేసుల్లో పలువురిని
అరెస్టు చేసిన పోలీసులు
● అప్రమత్తంగా వ్యవహరించాలంటున్న నిపుణులు
కడప అర్బన్ : సమాజంలో దురలవాట్లకు బానిసలుగా మారి సులభంగా డబ్బులను కాజేయాలనుకునే వారిలో ‘సైబర్ నేరగాళ్లు’ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారు. తాము ఎంచుకున్న మనిషిని దెబ్బతీయాలనుకునే ‘సైబర్ నేరగాళ్లు’ కేవలం సెల్‌ఫోన్‌ల ద్వారా.. తమ చాకచక్యంతో కోట్లాది రూపాయలు వివిధ దఫాలుగా కాజేస్తున్నారు. ఇందుకోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఇలాంటి కోవకు చెందినదే డిజిటల్ అరెస్ట్. జిల్లాలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అనేక సంఘటనలు జరిగినా.. వెలుగులోకి వచ్చిన రెండు కేసుల్లో జిల్లా పోలీసులు పురోగతి సాధించారు.
‘డిజిటల్ అరెస్ట్’కు పాల్పడే విధానం
ప్రధానంగా సైబర్ క్రైమ్ బాధితులకు ముఖ్యంగా వృద్ధులకు ఫోన్ చేసి లేక వాట్సాప్, వీడియో కాల్స్ ద్వారా ఫోన్ చేసి వారి ఆధార్ కార్డు చూపించి, మీ మీద ఎక్కువ సిమ్ కార్డ్స్ తీసుకుని కొంత మంది నిందితులు ఢిల్లీ కేంద్రంగా చేసుకుని హ్యూమన్ ట్రాఫిక్, మనీ ల్యాండరింగ్ మీద మీపై కేసు నమోదు అయినట్లు భయపెడతారు. బాధితులు నమ్మే విధంగా వారికి నకిలీ వాట్సాప్ ద్వారా నకిలీ ఎఫ్‌ఐఆర్ పంపి నిజమైనదిగా నమ్మిస్తారు. ఢిల్లీ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు, అతను మీ పేర్లు చెప్పారని, అందువల్ల మేము మీ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలియజేస్తారు.
నకిలీ పోలీసులైనా.. యూనిఫాం ధరించి..
మీపై ఎఫ్‌ఐఆర్ నమోదైనందున ఒక రూమ్‌లోకి వెళ్లి ఎవరూ లేకుండా వుండే విధంగా చూసుకుని, గది గడియ పెట్టాలని చెప్పి వాట్సా్‌ప్ ద్వారా వీడియో కాల్‌లో విచారణకు హాజరుగా వుండాలని, లేకపోతే వెంటనే ఢిల్లీ పోలీసులు/సీబీఐ అరెస్టు చేస్తారని భయపెడతారు. డిజిటల్ అరెస్టులో వున్నారు కావున మీరు ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని, ఒక వేళ చెబితే నేషనల్ సెక్యూరిటీ యాక్ట్– 1923 కింద 5 ఏళ్లు జైలు శిక్ష అని భయపెడతారు. బాధితులను భయపెట్టాలని కొన్ని నకిలీ సుప్రీంకోర్టు కాపీలను కూడా వాట్సా్‌ప్ ద్వారా పంపుతారు. బాధితులపై నమోదు అయిన కేసును ఢిల్లీ పోలీసు/సీబీఐ(ముంబై) అని లేక ఢిల్లీ అని చెప్పి అందరూ కూడా నకిలీ పోలీసులు అయినా.. నిజమైన పోలీసులు అని నమ్మించే విధంగా యూనిఫాంలో వుంటారు. అరెస్టు అయిన వ్యక్తిని ఢిల్లీ కోర్టులో హాజరు పెట్టినట్లు, అందుకు బాధితులను కూడా అరెస్టు చేసే విధంగా అరెస్టు వారెంట్ ఇచ్చినట్లు, నకిలీ జడ్జి కూడా వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడి భయపెడతారు. తమను 24 గంటల్లో అరెస్టు చేసి విచారణ చేయాలని జడ్జి, సీబీఐ ఎస్పీ చెప్పినట్లు నమ్మిస్తారు. లేని పక్షంలో 24 గంటలలో సీబీఐ వారితో అరెస్టు చేయిస్తామని పేర్కొంటారు. మొదట ఒక నెల రోజుల పాటు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయరు. తరువాత ఎఫ్‌ఐఆర్ అయినట్లు అరెస్టు చేస్తారని నమ్మిస్తారు.
డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని చెప్పి..
అరెస్టు నుంచి తప్పించుకోవాలి అంటే మీరు కొంత మొత్తం డిపాజిట్ చేయాలని, ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, వాటి వివరాలు చెప్పాలని అడుగుతారు. విచారణలో మీరు నిర్దోషి అవునో కాదో తేలుతుంది, అంత వరకు అరెస్టు చేయకుండా వుండాలంటే కొంత మొత్తం ఫిక్స్ డిపాజిట్ చేయాలని చెబుతారు. నిర్దోషిగా తేలితే అమౌంట్ తిరిగి మీ అకౌంట్‌లో జమ చేయడం జరుగుతుందంటారు. డబ్బులు ఫిక్స్ డిపాజిట్ చేస్తే వెంటనే చర్యలు తీసుకోరు, అరెస్టు చేయరు, కొన్ని రోజులు వాట్సా్‌ప్, వీడియో కాల్ ద్వారా విచారణ చేయరు, ఇంకా ఎక్కువ విచారణ కోసం ఈ కేసు దర్యాప్తు చేస్తామని చెప్పి నమ్మిస్తారు. కొన్ని అకౌంట్స్ వివరాలు తెలిపి, వాటికి డబ్బులు ఆర్‌టీజీఎస్/యూపీఐ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలని చెబుతారు. వారి మాటలకు భయపడి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత.. నేరగాళ్లు సెల్‌ఫోన్స్/వాట్సాప్ కాల్స్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు.
రెండు కేసులు ఛేదన
● పులివెందుల సబ్ డివిజన్‌లోని వేంపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రిటైర్డ్ ఎంఈఓను సైబర్ నేరగాళ్లు ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో మోసం చేశారు. ఈ సంఘటనలో అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాలోని 12 మంది నిందితులను జిల్లా పోలీస్ యంత్రాంగం అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 12.58 లక్షల నగదు, 17 సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకుంది.
● పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో ప్రశాంతినగర్‌కు చెందిన రిటైర్డ్ టీచర్ ప్రకాశంరెడ్డిని సైబర్ నేరగాళ్లు బెదిరించారు. ఆయన భయపడి సైబర్‌నేరగాళ్లు తెలిపిన బ్యాంక్ ఖాతాలకు రూ.1కోటి 62లక్షల 83 వేలను పంపించారు. ఈ సంఘటనలో బాధితుడు ప్రకాశంరెడ్డి భయపడి జూన్ 6న గుండెపోటు రావడంతో హఠాత్తుగా మరణించాడు. అతని కుమారుడు హితేష్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పులివెందుల అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. నిందితులైన ‘అంతర్ రాష్ట్ర సైబర్ నేరగాళ్ల’ ముఠాలో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.1,05,300 నగదు, 4 సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు వ్యవస్థలో డిజిటల్ అరెస్టు అనేది లేదు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలీసులు ఎప్పుడూ వాట్సాప్ కాల్ చేయరు. కేసులో నిందితులైతే నేరుగా ఇంటికి వచ్చి అరెస్టు చేస్తారు. అనుమానాస్పద కాల్ వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. లేనిపక్షంలో వైఎస్‌ఆర్ కడప జిల్లా పోలీస్ ఫిర్యాదుల వాట్సాప్ నంబర్ 9121100686 లేదా సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 కు ఫిర్యాదు చేయాలి. – షెల్కే నచికేత్ విశ్వనాథ్, ఎస్పీ
డిజిటల్ అరెస్ట్ పేరుతో కొత్త మోసం


