మద్యం మత్తులో డ్రైనేజీ కాలువలో పడి వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం: మద్యం మత్తులో బడిమెల నరసింహులు (51) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు డ్రైనేజి కాలువలో పడి మృతి చెందాడు. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్‌కు చెందిన నరసింహులు చీరెల వ్యాపారం చేసుకొని జీవనం సాగించేవాడు. ఆయన భార్య రమాదేవి కిరాణా దుకాణం నిర్వహిస్తోంది. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. నరసింహులు కొన్నేళ్ల నుంచి మద్యానికి బానిసయ్యాడు. చీరెల వ్యాపారానికి వెళ్లి 20–30 రోజులకు గానీ ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో రామేశ్వరం రోడ్డులోని కల్యాణమండపం సమీపంలోని మురికి కాలువలో పడి ఉన్న మృతదేహాన్ని సోమవారం స్థానికులు గుర్తించారు. దీంతో రమాదేవి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడంతో నరసింహులు మృతదేహంగా నిర్ధారణ అయింది. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


