ఘరానా దొంగ అరెస్టు
● ప్రత్యేక పరికరం ద్వారా చాకచక్యంగా షెట్టర్ లాక్ తీయడంలో దిట్ట
● 18.01 తులాల బంగారు నగలు స్వాధీనం
ప్రొద్దుటూరు క్రైం : చాకచక్యంగా దొంగతనం చేయడం అతని స్టైల్. ఒక ప్రత్యేక పరికరం ద్వారా రెండు నిమిషాల్లోనే షెట్టర్ తాళం తీస్తాడు. ఇలా పట్టపగలే ప్రొద్దుటూరులో రెండు బంగారు దుకాణాల్లో చోరీ చేసి చివరకు పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు బంగారు వర్క్‌షాపుల్లో చోరీకి పాల్పడిన రాగా హరీష్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన గురువారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లె ప్రాంతానికి చెందిన రాగా హరీష్ జులాయిగా తిరిగేవాడు. కొన్నేళ్లుగా అతను కడపలోని చిన్నచౌకు ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. 2022లో అతను చిన్నచౌకు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోరీ చేసి జైలు కెళ్లాడు. కొన్ని రోజుల క్రితం బెయిల్‌పై బయటికి వచ్చాడు. ప్రొద్దుటూరులోని దర్గా ఎదురుగా ఉన్న వీధిలో శ్రీనివాసనగర్‌కు చెందిన దరూబాయిగారి మహబూబ్‌షరీఫ్ బంగారు నగల వర్క్‌షాపులో ఈ ఏడాది ఆగస్టు 28న వర్క్‌షాపు తాళం పగులగొట్టి అందులో ఉన్న బంగారు నగలను దోచుకెళ్లాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు అదే రోజు వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఈ నెల 1న పోలంకి మహేష్ అనే స్వర్ణకారుడి వర్క్ షాపులో కూడా ఇదే మాదిరి పట్టపగలే షెట్టర్ తాళం తీసి అందులో ఉన్న సుమారు బంగారు నగలను హరీష్ చోరీ చేశాడు. ఈ రెండు కేసుల్లో నిందితుడైన హరీష్ కోసం వన్‌టౌన్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనా స్థలంలో లభించిన సీసీ పుటేజీ, సెల్‌ఫోన్ కాల్ డిటైల్స్ ఆధారంగా రాగా హరీష్ ఈ రెండు దొంగతనాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో అతను మైదుకూరు రోడ్డులోని ఆరవేటి థియేటర్ వద్ద ఉండగా గురువారం అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 18.01 తులాల బంగారు నగలను రికవరీ చేశారు. ఈ కేసులో మంచి ప్రతిభ కనబరచిన వన్‌టౌన్ సీఐ తిమ్మారెడ్డి, ఎస్‌ఐలు సంజీవరెడ్డి, శ్రీనివాసులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
పాత కాలపు తాళాలకు స్వస్తి చెప్పండి
ప్రజలతో పాటు వ్యాపారులు పాత కాలం నాటి తాళాలకు స్వస్తి పలకాలని డీఎస్పీ భావన సూచించారు. రెండు చోరీ కేసుల్లో పట్టుబడిన నిందితుడు రాగ హరీష్ తాళం తీసే విధానాన్ని చూసి తమకే ఆశ్చర్యం కలిగిందని డీఎస్పీ అన్నారు. తాళం తీసేందుకు అతను చిన్నపాటి ప్రత్యేకమైన పరికరాలను తయారు చేసుకున్నాడని తెలిపారు. వాటి ద్వారా షెట్టర్‌కు వేసిన తాళాలను కేవలం 1–2 నిమిషాల్లోనే తీశాడన్నారు. వీటి ద్వారానే అతను రెండు బంగారు వర్క్ షాపుల్లో షెట్టర్ తాళాలను పట్టపగలే తొలగించాడని చెప్పారు. దొంగలందరూ ఇదే విధానాన్ని అనుసరించే అవకాశం ఉందన్నారు. మార్కెట్‌లో కొత్త టెక్నాలజీ కలిగిన తాళాలు వచ్చాయని, వాటిని మాత్రమే ఇళ్లకు, షెట్టర్లకు వేసుకుంటే భద్రత ఉంటుందని సూచించారు.


