ఆదీ.. నీ స్థాయి ఏంటో తెలుసుకో !
జమ్మలమడుగు : దరిద్రపుగొట్టు రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన వ్యక్తిగా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందావు. అధికారం ఎక్కడ ఉంటే ఆ పార్టీలోకి జంప్ అయిపోతావు. అలాంటి నీకు ప్రజా నాయకుడైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా.. అని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిని ఎమ్మెల్సీ పి. రామసుబ్బారెడ్డి తీవ్రంగా విమర్శించారు. గురువారం జమ్మలమడుగులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2014లో వైఎస్సార్‌సీపీ టిక్కెట్ లేకపోతే మీ కుటుంబ సభ్యులతో వెళ్లి జగన్ కాళ్లు పట్టుకుని టిక్కెట్ తెచ్చుకున్నావని చెప్పారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి రెండేళ్లలోనే పార్టీ ఫిరాయించావు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల తరపున పోరాటం చేయాల్సిన నీవు అధికారం లేకపోవడంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచన చేరావని ధ్వజమెత్తారు. 2019లో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో పదికి పది సీట్లు వైస్సార్‌సీపీ వశమయ్యాయన్నారు. అందులో నన్ను కూడా నిండా ముంచేసిన చరిత్ర నీది అంటూ ధ్వజమెత్తారు. అధికారం పోవడంతోనే టీడీపీని వదిలిపెట్టి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందని ఆ పార్టీలో చేరావన్నారు. నీ జన్మలో రాజకీయాలు నిజాయితీగా చేశావా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామని గొప్పలు చెప్పుకోవడానికి కోట్లాది రూపాయల ఖర్చుతో మీటింగులు పెట్టి చెప్పుకుంటున్నారు. ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు, నిరుద్యోగ భృతి కింద 3వేల రూపాయలు కూటమి ప్రభుత్వం అమలు చేసిందా అని నిలదీశారు. ప్రస్తుతం ఆదినారాయణరెడ్డిని ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని, భారతమ్మను విమర్శిస్తే చంద్రబాబునాయుడు దగ్గరకు తీస్తాడని అనుకుంటున్నాడన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను నిజాయితీగా జరిపించండి.. మీ సంగతేమిటో ప్రజలే తేలుస్తారన్నారు. నీవు చేసే పనులు మీ ఇంట్లో వారికే నచ్చడం లేదన్న సంగతి తెలుసుకో అంటూ హితవు పలికారు.
అక్రమాలను ప్రోత్సిహించేది ఎవరు..
తాళ్లప్రొద్దుటూరు పోలీసు స్టేషన్‌కు కేటాయించిన భూమిని తమ బంధువులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నది ఎవరు అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి నిలదీశారు. జిల్లా ఎస్పీ తాళ్లప్రొద్దుటూరు స్టేషన్‌కు కేటాయించిన స్థలాన్ని ఒక సెంటు కూడా ఎవరికీ ఇవ్వకూడదన్నారు. పూర్తిగా స్టేషన్ నిర్మాణం చేపట్టి మిగిలిన స్థలాన్ని ప్రజల అవసరాలకు వినియోగించాలని, పోలీసులకు క్వార్టర్స్ నిర్మించాలని రామసుబ్బారెడ్డి సూచించారు. ఈ సమావేశంలో నాయకులు పి. గిరిధర్‌రెడ్డి, కొమెర్ల మోహన్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, మహేశ్వరరెడ్డి, వేణుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి


